- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో ప్రైవేటు స్కూళ్ల దందా.. మాయమాటలతో తల్లిదండ్రులకు బురిడీ!
విద్యాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్న ఇష్టారాజ్య పాఠశాలల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విద్యా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యా సంవత్సరం ముగియకముందే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించి తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన విద్యాసంస్థలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రకియను ప్రారంభించినప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్టేట్ బోర్డ్ లేదా సీబీఎస్ఈ నిబంధనలకు విరుద్ధంగా, పాఠశాల స్థాయిలోనే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌ల పేరుతో విద్యార్థులపై మితిమీరిన ఒత్తిడి పెంచుతున్నారు.
సీవో గ్రేడ్ పేరుతో మాయాజాలం
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ‘సీఓ గ్రేడ్’ కాన్సెప్ట్ పేరుతో కొత్త రకం మోసాలు వెలుగుచూస్తున్నాయి. కార్పొరేట్ స్థాయి వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ రంగురంగుల బ్రోచర్లు చూపిస్తూ సామాన్య తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. తీరా ఆరా తీస్తే వీటిలో మెజారిటీ స్కూళ్లకు కనీస గుర్తింపు కూడా లేకపోవడం గమనార్హం. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్క అనుమతి.. 18 బ్రాంచీలు
ఇటీవల హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో వెలుగుచూసిన ఒక ఉదంతం విద్యాశాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఒకే స్కూల్ పేరుతో ఏకంగా 18 బ్రాంచీలను ఏర్పాటు చేసి యథేచ్చగా స్కూల్స్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి బ్రాంచీకి విడివిడిగా అనుమతులు ఉండాలి.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం ఒక పత్రంతోనే పదుల సంఖ్యలో స్కూళ్లు నడుపుతున్నారు. హోర్డింగ్‌లు, సోషల్ మీడియా ద్వారా ఫీజులు, ఫలితాల విషయంలో తప్పుడు వాగ్దానాలు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారని, ఫైర్ డిపార్ట్‌మెంట్, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగాల నుండి రావాల్సిన కనీస భద్రతా అనుమతులు లేకుండానే ఈ స్కూల్స్ నడుస్తున్నాయని ఇటీవల పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు ట్రస్మా(తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం) వినతిపత్రం సమర్పించింది. గ్రేటర్ పరిధిలోని కొన్ని స్కూళ్లు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్(టీసీ) వంటి సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే విద్యార్థులను చేర్చుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
నోటిఫికేషన్ లేకుండానే అడ్మిషన్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే అడ్మిషన్లు ప్రారంభించాలి. కానీ, ఫిబ్రవరి నుండే అడ్మిషన్లు, స్క్రీనింగ్ టెస్టుల పేరుతో కొన్ని కార్పోరేట్ స్కూళ్లు హడావుడి చేస్తున్నాయి. అనుమతులు లేని స్కూళ్లలో చేరితే భవిష్యత్తులో విద్యార్థుల సర్టిఫికేట్లకు గుర్తింపు ఉండదు. అపార్, పెన్ నంబర్లు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తల్లిదండ్రులు ప్రకటనలు చూసి మోసపోవద్దు. -ట్రస్మా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
రాష్ట్రంలో ఎన్నో స్కూల్స్ అనుమతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన ఒక ప్రముఖ విద్యా సంస్థ 6 నుండి 9 తరగతి అనే సీఓ గ్రేడ్ కాన్సెప్ట్‌తో స్కూల్స్ ఏర్పాటు చేసి అధిక మొత్తంలో డొనేషన్లు వసూలు చేస్తోంది. చాలా స్కూల్స్ అద్దె భవనాల్లో తరగుతులు నిర్వహిస్తున్నా డీఈఓలు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలున ఉల్లంఘించిన స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలి. -సీజేఎస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్






