TG: రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన అధికారులు!

by Gantepaka Srikanth |

ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాయి.

TG: రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన అధికారులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాయి. ఒక్కో టీమ్ లో ఇద్దరు చొప్పున 23 బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తీవ్ర ఆరోపణలు వచ్చిన 23 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు ‘దిశ’కు వెల్లడించారు. ఈ స్థాయిలో తనిఖీలు నిర్వహించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని అధికారవర్గాలు వెల్లడించాయి. బీఎస్సీ నర్సింగ్ తో పాటు ఎమ్మెస్సీ నర్సింగ్ కూడా ప్రైవేటు కళాశాలల్లో చదువుకునేందుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో 95 ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. 5,630 సీట్లు, 22 ప్రైవేట్ ఎమ్మెస్సీ నర్సింగ్ (పీజీ) కళాశాలలు ఉండగా 479 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 21 ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలపై మాత్రమే తనిఖీలు జరుగుతున్నారు.

ఒకే భవనంలో 8 కాలేజీ

రంగారెడ్డి జిల్లాలో ఒకే భవనంలో 8 నర్సింగ్ కళాశాలలు, నల్లగొండలో ఒకే భవనంలో నాలుగు నర్సింగ్ కళాశాలలు, హయత్ నగర్ లో ఒకే భవనంలో 8 నర్సింగ్ కళాశాలలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించి విస్తుపోయారు. చాలాచోట్ల గుర్తింపు కోసం అడ్రస్ లో భవనాలు లేవని, సగం నర్సింగ్ కళాశాలలకు పేరెంట్ హాస్పిటల్స్ లేవని తనిఖీల్లో తేలింది. దీంతో క్లినికల్ ప్రాక్టీస్ లేకుండానే నర్సింగ్ విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న దుస్థితి నెలకొంది. ఫలితంగా సరైన ప్రమాణాలు లేకుండా నర్సింగ్ విద్యార్థులు ఉద్యోగాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ దుస్థితికి ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల యాజమాన్యాలు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చాలా కాలేజీల్లో ముక్కు పిండి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ సరైన విద్యాప్రమాణాలు కల్పించడం లేదు.

స్టూడెంట్స్, ఫ్యాకల్టీ లేరు

అధికారుల తనిఖీల్లో చాలా కళాశాలల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీ లేని విషయం తేటతెల్లమైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాలలో కనీస మౌలిక వసతులూ లేవు. బోర్డుపై కళాశాలను ఏర్పాటు చేసి ఫీజులు వసూలు చేస్తూ, ఎలాగోలా వారిని పాస్ చేయించి సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తనిఖీ అధికారులకు మర్యాదలు

నర్సింగ్ కాలేజీల తనిఖీలకు ఏర్పాటు చేసిన 23 బృందాల్లో కొందరికి ప్రైవేట్ కళాశాలలు సకల మర్యాదలు చేసినట్లు తెలిసింది. తనిఖీ బృందాలకు సదరు కాలేజీల యాజమాన్యాలు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేసి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇలాంటి తూతూమంత్రపు తనిఖీలతో ప్రైవేట్ కళాశాలల వ్యవహారం ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని నర్సింగ్ కాలేజీలను చక్కదిద్దాలని విద్యార్థులు, వారి పేరెంట్స్, బంధువులు కోరుతున్నారు.

Next Story