- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు
తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హెచ్ఆర్‌డీఏ వినతిపత్రం సమర్పించింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కొన్ని మెడికల్ కాలేజీలు వాటిని ఉద్దేశపూర్వకంగా పాటించడం లేదని హెచ్ఆర్‌డీఏ పేర్కొంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆర్థిక భారానికి గురవుతున్నారని, వారి విద్యాభవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని తెలిపింది. ప్రత్యేకంగా రిపోర్టింగ్ రోజునే బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలని కొన్ని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని హెచ్ఆర్‌డీఏ ఆరోపించింది.
ఇది ప్రవేశాల నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, సంప్రదాయంగా తుది కౌన్సెలింగ్ రౌండ్ పూర్తయ్యాకే బ్యాంక్ గ్యారంటీలకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. రిపోర్టింగ్ అనంతరం విద్యార్థులకు తగిన సమయం ఇవ్వాలన్న నిబంధనలను కాలేజీలు విస్మరిస్తున్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, మేనేజ్ మెంట్ కోటా ఫేజ్-1 ప్రవేశాలకు చివరి తేదీ అయిన జనవరి 24, 2026 శనివారం (బ్యాంక్ హాలిడే) కావడం వల్ల విద్యార్థులు బ్యాంక్ గ్యారంటీలు సమర్పించడం అసాధ్యంగా మారిందని హెచ్ఆర్‌డీఏ వివరించింది. కాలేజీలు కావాలనే ఇలాంటి పరిస్థితులను సృష్టించి, విద్యార్థులను ‘నాన్-కంప్లయింట్’గా ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించింది. హైకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలంటూ, బ్యాంక్ గ్యారంటీల విషయంలో కాలేజీలను నియంత్రించాలని, అలాగే ఈ కారణాలతో విద్యార్థులపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకుండా యూనివర్సిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్‌డీఏ డిమాండ్ చేసింది. విద్యార్థుల విద్యా హక్కులను కాపాడేందుకు యూనివర్సిటీ తక్షణ జోక్యం అవసరమని విజ్ఞప్తి చేసింది.






