- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఆగని ‘ప్రైవేటు’ స్కూళ్ల దోపిడీ.. యథేచ్ఛగా బుక్స్, యూనిఫామ్స్ దందా
కొత్త విద్యాసంవత్సరం వేళ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ మళ్లీ షురువైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే చాలు.. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల దందాకు తెరలేపుతున్నాయి. కేవలం ట్యూషన్ ఫీజులతోనే ఆగకుండా అడ్మిషన్ ఫీజుల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. నాలుగు గోడల మధ్యే పిల్లల బాల్యం బందీ అవుతున్నది. నిబంధనల ప్రకారం ఆటస్థలం లేకపోతే గుర్తింపు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా కాగితాలకే పరిమితమైంది. రాష్ట్రంలోని 80 శాతం ప్రయివేటు స్కూళ్లు ప్లేగ్రౌండ్‌లు లేక నడుస్తున్నాయని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. కాగా, నాణ్యమైన చదువు, పిల్లల భవిష్యత్ పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. ఫీజుల మోత భరించలేక మధ్యతరగతి, పేద తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి స్కూల్ యూనిఫామ్స్, బెల్టులు, షూస్, పుస్తకాలను తాము నిర్ణయించిన దుకాణాల్లోనే వారు చెప్పిన భారీ ధరలకే కొనాలని బలవంతం చేస్తున్నారు.
కాంక్రీట్ జంగిల్స్ మధ్య..
ప్రీ-ప్రైమరీ(ఎల్ కేజీ, యూకేజీ, నర్సరీ) విద్యార్థులకు శారీరక వికాసం చాలా ముఖ్యం. కానీ, నేడు మెజారిటీ ప్రైవేట్ స్కూళ్లు కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేని చిన్న చిన్న అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ బిల్డింగుల్లో నడుస్తున్నాయి. ఫీజులు భారీగా వసూలు చేస్తున్న పాఠశాలలు, విద్యార్థుల భద్రతను మాత్రం గాలికొదిలేశాయి. మరోవైపు కనీస ఫిట్‌నెస్ లేని డొక్కు వాహనాల్లో విద్యార్థులను తరలిస్తున్నారు. సామర్థ్యానికి మించి, విద్యార్థులను వాహనాల్లో ఎక్కించి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్కూల్ బస్సుల కండీషన్‌ను తనిఖీ చేయాల్సిన రవాణాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
సోషల్ స్టేటస్ కోసం ఆరాటం..
సోషల్ స్టేటస్ కోసమే చాలామంది పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బళ్లకు పంపించకుండా ప్రయివేటు స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తేనే తమ పిల్లలకు గొప్ప భవిష్యత్ ఉంటుందనే భ్రమలో అప్పులు చేసైనా సరే భారీ ఫీజులు చెల్లిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, కనీసం ఆటస్థలాలు లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






