చర్చలు సఫలం.. నేటి నుంచి తెరచుకోనున్న ప్రైవేట్ కాలేజీలు

by Naga Rani Yarlagadda |

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్ కు తెరపడింది.

చర్చలు సఫలం.. నేటి నుంచి తెరచుకోనున్న ప్రైవేట్ కాలేజీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్ కు తెరపడింది. నేటి నుంచి యధాతథంగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. శుక్రవారం ప్రైవేట్ కాలే జీల యాజమాన్యాలతో ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి. చర్చల అనంతరం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సంఘం (ఫతి) తమ నిరసన కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

బకాయిల విడుదలకు హామీ..

కాలేజీల యాజమాన్యాలు బకాయిలకు సంబంధించి మొత్తం రూ. 1,500 కోట్లు అడ గగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రక టన చేశారు. ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేశామని, మరో రూ. 600 కోట్లు వెంటనే విడు దల చేస్తామన్నారు. మిగిలిన రూ.300 కోట్లు కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫీజు రీయంబర్స్‌ మెంట్‌కు సంబంధించి ఒక కమిటీ వేయాలని కళాశాలల యాజమాన్యాలు కోరగా, డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక వచ్చేలా చేస్తామన్నారు. ఏ రకమైన సంస్కరణలు అవసరమో చర్చిస్తామని, ఆ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు.

పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తాం

ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం ఫతి సంఘం అధ్యక్షుడు నిమ్మటూరి రమేశ్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన పైన, సీఎం కార్యాలయం అధికారులపై కానీ, డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులపై కానీ తాము ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు మా మాటలను వక్రీకరించాయన్నారు. మా మాటలను వక్రీకరిస్తూ మీడియాలో వచ్చిన ప్రకటనల పట్ల ఫతి నుంచి ఒక ఖండన ప్రకటనను ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. ఈ నెల 3 నుంచి సమ్మెకు వెళ్లడం వల్ల కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయినందుకు నిమ్మటూరి రమేశ్ విచారం వ్యక్తం చేశారు. నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్వహించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

లెక్చరర్ల సాంత్వన సభ రద్దు

ప్రభుత్వంతో చర్చలు సఫలం అయినందున, ఈ నెల 8న నిర్వహించాలనుకున్న లెక్చరర్ల సాంత్వన సభను రద్దు చేసుకుంటున్నట్లు ఫతి జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ సమయంలో లెక్చరర్ల ప్రదర్శన తప్పు అని కోర్టు చెప్పిందని కూడా ఆయన గుర్తు చేశారు.

Next Story