TG: స్వర్గం చూపిస్తాం రమ్మంటూ.. రోజూ 10th విద్యార్థులకు కాల్స్, మెసేజెస్

by Gantepaka Srikanth |

కార్పొరేట్ కళాశాలల మాయాజాలానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు బలవుతున్నారు.

TG: స్వర్గం చూపిస్తాం రమ్మంటూ.. రోజూ 10th విద్యార్థులకు కాల్స్, మెసేజెస్
X

దిశ, ఆమనగల్: కార్పొరేట్ కళాశాలల మాయాజాలానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు బలవుతున్నారు. పది పరీక్షలు ముగియక ముందే ఇంటర్ అడ్మిషన్ల కోసం ఆమనగల్, కడ్తాల్ మండల కేంద్రాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ, మాయమాటలు చెప్తూ, తమ కళాశాలల్లో స్వర్గం ఉంటుందన్నట్లు చూపిస్తూ విద్యార్థుల అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలల ఆగడాలు ఎక్కువ అయ్యాయని విమర్శలున్నాయి.

3 నెలల ముందు నుంచే సమాచార సేకరణ..

పది పరీక్షలు ప్రారంభానికి 3 నెలల ముందు నుంచే ఇంటర్ అడ్మిషన్ల కోసం కార్పొరేట్ యాజమాన్యాలు ఏజెంట్లను నియమించారు. పదో తరగతి విద్యార్థి పూర్తి డేటాను ఏజెంట్లు సేకరించి, వారి ఇళ్ల వద్దకు చేరి అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముందస్తుగా అడ్మిషన్ తీసుకుంటే రాయితీ ఇస్తామని ఆశ చూపిస్తున్నారు.

డాటాను అమ్ముకుంటున్న యాజమాన్యాలు..

ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో సుమారు 15 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 700 మంది విద్యార్థులు కళాశాల అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే అదనుగా భావించిన యాజమాన్యాలు విద్యార్థుల డాటాను కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలకు అందజేసి, కళాశాల యాజమాన్యం నుంచి విహారయాత్రలకు వెళ్తున్నారు. తమ విద్యార్థుల డాటాను ఇతరులకు అమ్ముకోకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పాఠశాల యాజమాన్యాలు సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కార్పొరేట్ కళాశాలల ఆగడలు అరికట్టాలి: శ్రీకాంత్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

పదవ తరగతి విద్యార్థుల ప్రవేశం కోసం కార్పొరేట్ కళాశాల యాజమాన్యాల ఆగడాలను ప్రభుత్వం అరికట్టాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ చేస్తూ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తున్నారు. తమ డాటా కళాశాలకు ఎలా చేరిందోనని తలలు పట్టుకుంటున్నారు.

Next Story