హైదరాబాద్–బెంగళూరు రూట్లో ప్రైవేటు బస్సులదే రాజ్యం.. ప్రజారవాణా అంతంత మాత్రమే!

by Kema Shiva Kumar |

సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు ఐటీ రంగానికి హబ్‌గా ఉంది.

హైదరాబాద్–బెంగళూరు రూట్లో ప్రైవేటు బస్సులదే రాజ్యం.. ప్రజారవాణా అంతంత మాత్రమే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు ఐటీ రంగానికి హబ్‌గా ఉంది. అక్కడ తెలంగాణకు చెందిన వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వివిధ కంపెనీల్లో పని చేస్తున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు తరచుగా బెంగళూరును సందర్శిస్తూ ఉంటారు. ఇక వ్యాపార రీత్యా వెళ్లే వారి సంఖ్య పెద్ద సంఖ్యలోనే ఉండటంతో హైదరాబాద్–బెంగళూరు రూట్‌ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.

కేవలం 3 రెగ్యులర్ రైళ్లు మాత్రమే..

ప్రస్తుతం హైదరాబాద్–బెంగళూరు మధ్య మూడు రెగ్యులర్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కాచిగూడ–అశోకపురం ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ–యెలహంక ఎక్స్‌ప్రెస్‌, వందే భారత్‌. ఈ మూడు రైళ్లు కలిపి సీటింగ్ సామర్థ్యం సుమారు 4,000 సీట్లు మాత్రమే. వీటికి అదనంగా వారాంతపు, ప్రత్యేక రైళ్లు నడిపినా వాటి ప్రభావం పరిమితంగానే ఉంటుంది. అదనపు రైళ్ల ద్వారా మరో 4, 5 వేల వరకు సీట్లు లభిస్తున్నప్పటికీ, మొత్తం డిమాండ్‌తో పోలిస్తే ఇవి చాలా తక్కువే అని చెప్పొచ్చు. గతంలో సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు గరీబ్ రథ్ రైలు ప్రారంభించిన సందర్భంలో రైల్వే బోర్డు వయా మహబూబ్‌నగర్ మీదుగా (దగ్గరి మార్గం) నడిపించాలని భావించింది. కానీ ట్రావెల్స్ బస్సులు నిర్వహించే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఈ రైలు అందుబాటులోకి వస్తే తన బస్సులకు గిరాకీ తగ్గుతుందని భావించిన సదరు నేత దాన్ని వయా రాయచూరు మీదుగా మళ్లించారు.

ఆర్టీసీ బస్సులు అంతంతంగానే..

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 29 తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో సుమారు 1,200 సీట్లు మాత్రమే ఉన్నాయి. 23 కర్ణాటక ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా అందులో సుమారు 900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా రైళ్లు, రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు కలిపి 6,000–6,500 సీట్లు మాత్రమే ప్రజారవాణా ద్వారా అందుబాటులో ఉన్నాయి.

ప్రయివేటు బస్సుల ఆధిపత్యం

హైదరాబాద్ - బెంగళూరు ప్రాంతం మధ్య ప్రజారవాణా సౌకర్యం సరిగా లేక పోవడంతో మరో మార్గం లేక ప్రయాణికులు ప్రయివేటు ఏసీ స్లీపర్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. రవాణా శాఖ సమాచారం ప్రకారం సుమారు 250 ప్రయివేటు స్లీపర్ బస్సులు ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నాయి. అదే సంఖ్యలో బస్సులు బెంగళూరు నుంచి తిరిగి వస్తున్నాయి. వీటిలో ప్రతి బస్సులో సగటున 40 సీట్ల సామర్థ్యంగా లెక్క కట్టినా.. రోజుకు దాదాపు 10,000 సీట్లు ప్రైవేటు బస్సుల ద్వారానే అందుబాటులోకి వస్తున్నాయి. ఇది ప్రజారవాణా కంటే ఎంతో ఎక్కువ.

ఎన్నో ఘటనలు

హైదరాబాద్ - బెంగళూరు రూట్‌లో ఇప్పటికే రెండు దారుణ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2013లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు అగ్నికి ఆహుతై 45 మంది చనిపోయారు. తాజాగా కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలు ప్రయాణికుల్లో భయాన్ని రేకెత్తించాయి. అయినా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూపక పోవడంతో ప్రయాణికులు మళ్లీ ప్రయివేటు బస్సులనే ఎంచుకుంటున్నారు.

ప్రజా రవాణా భద్రత.. ప్రైవేటు నిర్లక్ష్యం

ప్రజారవాణాలో భద్రత విషయంలో రాజీ ఉండదు. ఆర్టీసీ డ్రైవర్లు సుశిక్షితులై ఉంటారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో డ్రైవింగ్‌లో తప్పులు జరిగితే ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారు. కానీ ప్రయివేటు ట్రావెల్స్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. డ్రైవర్లు అతివేగంగా నడపడం, అనధికారంగా మార్గమధ్యంలో ఆగడం, నిర్దేశిత సమయానికి ముందూ వెనుకా గమ్యస్థానాన్ని చేరుకోవడం సర్వసాధారణం. కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌ లైసెన్స్‌ సైతం నకిలీ సర్టిఫికెట్‌తో పొందినదని విచారణలో తేలింది. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. వందలాది ప్రయివేటు బస్సుల్లో డ్రైవర్ల లైసెన్సులు, డ్రైవింగ్ స్కిల్స్‌‌పై అనుమానాలు ఉన్నప్పటికీ వాటిపై సమగ్ర తనిఖీలు జరగడం లేదనే విమర్శలున్నాయి.

రవాణా సదుపాయాలు లేకే: సుమన్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

హైదరాబాద్–బెంగళూరు మార్గంలో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా ప్రజారవాణా అందుబాటులో లేదు. ఫలితంగా భద్రత హామీ లేని ప్రయివేటు స్లీపర్ బస్సులే మాకు ప్రధాన ఆధారం అవుతున్నాయి. ఇంత ఘోర ప్రమాదం జరిగినా మేము ఉద్యోగం చేసేందుకు ప్రయివేటు స్లీపర్ బస్సుల్లోనే వెళ్లాల్సి వస్తోంది. ప్రజారవాణా సామర్థ్యాన్ని పెంచకపోతే ఇలాంటి ప్రమాదాలు మరలా పునరావృతం కావని గ్యారెంటీ లేదు. అందుకే ఈ మార్గంలో మరిన్ని రైళ్లు నడపాలి.

విశాఖ తరహాలో 2 వందే భారత్ రైళ్లు నడవాలి: యశ్వంత్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

సికింద్రాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి రెండు వందే భారత్ రైళ్లు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సైతం అంతకు మించిన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైలులో రోజుకు కేవలం 1,128 మంది మాత్రమే ప్రయాణం చేయగలరు. అన్నింటికంటే అత్యంత తక్కువ సమయంలో బెంగళూరు చేరుకునే అవకాశం ఉన్న వందేభారత్ రైలు నిత్యం పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. కాబట్టి మరో వందే భారత్ రైలును ప్రవేశపడితే బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

Next Story