ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు రెడీ

by Prasad Jukanti |

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేట్ బిల్లు పెడతామని కేటీఆర్ వెల్లడించారు.

ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు రెడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలకు మూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16 నుంచి 30 వరకు సమావేశాలు జరగబోతున్నాయి. ఇందుకోసం అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల (Six Guarantees) హామీల విషయంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు (Private Bill) పెడతామని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

సీఎం మాటకే విలువ లేదు:

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. బఫర్‌జోన్‌లోని ఇళ్లు కూల్చేస్తామని చెబుతున్నారు. కొడంగల్‌లో రేవంత్ ఇల్లు కూడా చెరువు పరిధిలోనే ఉందని ఆరోపించారు. బఫర్ జోన్‌లోని మంత్రుల ఇళ్ల జోలికి వెళ్లడం లేదు కానీ సామాన్యులు, పేదల ఇళ్లనే కూలుస్తున్నారని మండిపడ్డారు. మూసీ ఒడ్డున ఉన్న అపార్ట్‌మెంట్లు జీరో వాల్యూ అయిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రజల ఇళ్లకు కాదు సీఎం రేవంత్ రెడ్డి మాటకు, సీఎం మొఖానికి జీరో వాల్యూ అని ఆయనను ఎవరూ నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో ఉందని చెబుతున్నారు. అలాంటప్పుడు లక్ష కోట్ల మూసీ ప్రాజెక్ట్ ఎందుకు అని ప్రశ్నించారు.

Next Story