- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉన్నత విద్యలో ‘ప్రైవేటు’ హవా
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో అధికులు ప్రైవేటు విద్యా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో అధికులు ప్రైవేటు విద్యా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రానికి దూరవిద్య ప్రవేశాల్లో విశేషణ ఆదరణ ఉంది. పీజీ డిప్లొమా కోర్సుల్లో మహిళలే అధికంగా చేరుతున్నారు. కేంద్ర విద్యా శాఖ ఇటీవల విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్ హెచ్ఈ) 2023-24 నివేదికలో ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యలో మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు చేరగా, అందులో ఏకంగా 9.30 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లోనే ప్రవేశాలు పొందారు. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కేవలం 1.70 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. అనగా రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో దాదాపు 80 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల్నే ఎంచుకున్నారు.
వారి ఆధిపత్యమే కారణం..
రాష్ట్రవ్యాప్తంగా 1780 కాలేజీల్లో 11 లక్షల మంది చదువుతుండగా.. అందులో ప్రైవేటు కాలేజీలు(మొత్తం) 9,30,057 మంది కాగా అందులో అన్ ఎయిడెడ్‌లో 8,85,372 మంది, ఎయిడెడ్‌లో 44,685 మంది ఉన్నారు. కాగా ప్రభుత్వ కాలేజీల నుంచి 1,70,026 మంది చదువుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటం, సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రైవేటు యాజమాన్యాల ఆధిపత్యం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, డిగ్రీ కాలేజీల్లో మెజారిటీ సంస్థలు ప్రైవేటుకు చెందినవే కావడం ఈ వ్యత్యాసానికి అద్దం పడుతోంది.
దూరవిద్య ప్రవేశాల్లో విశేష ఆదరణ..
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో దూర విద్య విధానం ద్వారా అభ్యసిస్తున్న విద్యార్థుల తాజా నివేదిక ప్రకారం.. తెలంగాణ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో ఏకంగా 1,74,546 మంది విద్యార్థులు దూరవిద్య ద్వారా వివిధ కోర్సుల్లో చేరారు.వివిధ రాష్ట్రాల డేటాను పరిశీలిస్తే, తెలంగాణలో పురుషులతో పాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో నమోదు చేసుకున్న మొత్తం విద్యార్థులలో 90,833 మంది పురుషులుకాగా, 83,713 మంది మహిళలు ఉన్నారు.
పీజీ డిప్లొమా కోర్సులలో చేరిన మొత్తం 7,897 మంది విద్యార్థులలో ఏకంగా 3,915 మంది మహిళలే కావడం విశేషం. రాష్ట్రంలో డిప్లొమా కోర్సుల్లో 1,572 మంది (775 పురుషులు, 797 మహిళలు), సర్టిఫికెట్ కోర్సుల్లో 848 మంది (301 పురుషులు, 547 మహిళలు) నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర 5,74,505 మంది విద్యార్థులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత తమిళనాడు 3,56,420 మందితో రెండవ స్థానంలో ఉంది. రాజస్థాన్: 1,84,156 మంది విద్యార్థులతో మూడవ స్థానంలో ఉండగా, తెలంగాణ 1,74,546 తర్వాతి స్థానంలో నిలిచి దక్షిణ భారతదేశంలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.






