- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో స్కౌటింగ్ విస్తరణకు ప్రాధాన్యత.. గవర్నర్‌కు బీఎస్‌జీ ప్రతినిధుల నివేదిక
తెలంగాణలో స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG) కార్యకలాపాల విస్తరణపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ప్రతినిధి బృందం నివేదిక సమర్పించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అభినందించారు. రాష్ట్ర శిక్షణా కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు యువ స్కౌట్‌ల వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బీఎస్‌జీ) తెలంగాణ విభాగం ఉన్నత స్థాయి నాయకత్వం బుధవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్కౌటింగ్ కార్యకలాపాల అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై గవర్నర్‌కు సమగ్ర నివేదికను సమర్పించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. దానకిషోర్, బీఎస్‌జీ రాష్ట్ర చీఫ్ కమిషనర్ మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొని గవర్నర్‌ను సత్కరించారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు, గవర్నర్ ఫండ్ సహకారంతో రాష్ట్రంలోని స్కౌట్ భవనాలు, శిక్షణ కేంద్రాల మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. దానకిషోర్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో సుమారు 1,200 యూనిట్లు నమోదై ఉండగా, 30 వేల మందికి పైగా విద్యార్థులు చురుకుగా పాల్గొంటున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 1,000 పాఠశాలలను చేర్చామని, 2026-27లో మరో 1,000 పాఠశాలలను చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో ఒక బీఎస్‌జీ యూనిట్ ఉండేలా ప్రత్యేక "క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్" రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.






