సహకారంతో పరిష్కరించుకోండి.. అంతర్రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన

by Prasad Jukanti |

అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకారం, సాంకేతికతతో పరిష్కరించుకోవాలని పీఎం మోడీ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల వేళ ఇది ఆసక్తికరంగా మారింది.

సహకారంతో పరిష్కరించుకోండి.. అంతర్రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో దీర్ఘకాలంగా నలుగుతున్న వివాదాల్లో అంతరాష్ట్ర జలాల అంశం ఒక్కటి. రాష్ట్రాల మధ్య సరైన సహకారం లేకపోవడంతో ఎన్నో ఏళ్ళుగా ప్రతిపాదిత ప్రాజెక్టులు పెండింగ్ పడుతున్నాయి. ఈ నేపథ్య అంతర్రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని మోడీ కీలక సూచన చేశారు. జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని, సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణతో సమస్యలు అధిగమించాలన్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగుతున్న కెన్‌-బెట్వా ప నదుల అనుసంధానం ప్రాజెక్టు దేశానికే ఒక నమూనగా నిలవాలని ఆకాంక్షించారు. వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న పలు అభివృద్ధి పనులపై నిన్న సాయంత్రం ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించించి ఈ సూచన చేశారు.

సౌకర్యాలు అందకుండా పోతాయి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఉద్దేశించిన ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా.. రైల్వే, విద్యుత్, రహదారుల రంగానికి చెందిన సుమారు రూ. 30,000 కోట్ల విలువైన 7 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని సమీక్షించారు. తొమ్మిది రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఈ ప్రాజెక్టుల అమలులో ఆలస్యం జరిగితే అంచనా వ్యయం పెరగడమే కాకుండా, ప్రజలకు సకాలంలో అవసరమైన సౌకర్యాలు అందకుండా పోతాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించడానికి నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, సమర్థవంతమైన నీటి పారుదల (Irrigation) ప్రక్రియలను ఒకదానితో ఒకటి అనుసంధానించేలా సమగ్ర ప్రణాళికలను గుర్తించాలని ఈ సందర్భంగా రాష్ట్రాలను మోడీ కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాల వేళ:

కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చాలా కాలంగా నీటి వనరుల పంపకాలు, ప్రాజెక్టుల విషయంలో జల వివాదాలు కొనసాగుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాలా తెలుగు రాజకీయాలు సాగుతున్నాయి. ఈ రెండు నదుల నీటి పంపకాలు, బనకచర్ల లింకేజ్ ప్రాజెక్టు, మహారాష్ట్రతో తమ్మిడి హట్టి వంటి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరపవలిసి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన సూచన ఆసక్తిగా మారింది.

Next Story