ఫస్ట్ టైమ్ కేసీఆర్ ఫ్యామిలీపై ప్రధాని కామెంట్స్.. హెచ్చరికలా? ఫ్యూచర్ యాక్షన్ సంకేతాలా?

by GSrikanth |   (  Updated:2023-04-09 00:00:56  IST  )

గతంలో సీఎం కేసీఆర్ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పీఎం మోడీ సైలెంట్ గా ఉన్నారు. కానీ ఈ సారి రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని తన స్పీచ్ లో కుటుంబ పాలన, అవినీతి గురించి మాట్లాడారు.

ఫస్ట్ టైమ్ కేసీఆర్ ఫ్యామిలీపై ప్రధాని కామెంట్స్.. హెచ్చరికలా? ఫ్యూచర్ యాక్షన్ సంకేతాలా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో సీఎం కేసీఆర్ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పీఎం మోడీ సైలెంట్ గా ఉన్నారు. కానీ ఈ సారి రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని తన స్పీచ్ లో కుటుంబ పాలన, అవినీతి గురించి మాట్లాడారు. పరోక్షంగా కేసీఆర్ ఫ్యామిలీ గురించి ప్రస్తావిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోడీ వ్యాఖ్యల వెనక వ్యూహం ఏమై ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఈ కామెంట్ల వెనక అర్థం అవినీతిని ఎక్స్ పోజ్ చేయడమేనా? లేక భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించడమా? సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉదహరిస్తూ అవినీతిని అంతమొందించడం ఖాయమనే స్పష్టమైన మెసేజ్ ఎందుకు ఇచ్చారు?.. ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.

గతంలో లేని విధంగా..

గతేడాది ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహావిష్కరణ తర్వాత ప్రధాని మోడీ ఐదుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. కానీ ఏనాడూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై ప్రత్యక్షంగా, పరోక్షంగానో విమర్శలు చేయలేదు. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పరేడ్ గ్రౌండ్స్ ప్రసంగంలో కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే ఈ కామెంట్లపై సీఎం ఫ్యామిలీ సైలెంట్‌‌గా ఉండిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, కేసీఆర్ కుటుంబంపై బీజేపీ నేతలు ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారిందని, కమీషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తున్నారని, అంచనా వ్యయాన్ని పెంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తొలిసారిగా అవినీతి సర్కార్ అంటూ అమిత్ షా అభివర్ణించారు.

హెచ్చరికలేనా?

కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం అంటూ ప్రధాని విమర్శలు చేయడం బీఆర్ఎస్ నేతల్లోనే కాక రాష్ట్ర రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ఫ్యామిలీని ప్రజల్లో ఎక్స్ పోజ్ చేయడం కోసమా? లేక రానున్న రోజుల్లో యాక్షన్ తీసుకోనున్నామంటూ పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడమా అనే చర్చకు దారితీశాయి. అవినీతిపరులంతా ఒక్కటై దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయంటూ ప్రధాని వ్యాఖ్యానించడం ఇకపైన ఏదో జరగబోతున్నదనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది. ఏ కోర్టుకు వెళ్లినా దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తాయని, అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదనే వార్నింగ్ ఆయన మాటల్లోనే వ్యక్తమైంది. అవినీతిని అంతమొందిస్తామని, అందుకు ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేయడం వెనక కూడా ఇదే ప్రధానమనే భావన అనేది ప్రస్ఫుటమైంది. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు అంశాలు కావని, ఈ రెండూ పరస్పరం కలిసే ఉంటాయని నొక్కిచెప్పడం గమనార్హం. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగానూ మోడీ కుటుంబ పాలన గురించి ప్రస్తావించి, దేశానికి ఇవి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ నెహ్రూ-గాంధీ అంశంపైనే ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పుడు తెలంగాణనూ ప్రస్తావించడం మొదలుపెట్టింది. ఈ గడ్డ మీద నుంచి ప్రధాని స్వయంగా తొలిసారి కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం విశేషం. బీఆర్ఎస్ కార్యకర్తలు కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేయొద్దని, తెలంగాణ కోసం పని చేయాలంటూ బండి సంజయ్ మెసేజ్ ఇచ్చిన మరుసటి రోజునే కేసీఆర్ కుటుంబ అవినీతిని, భవిష్యత్తులో ఎదుర్కోబోయే చిక్కులను ప్రధాని నొక్కిచెప్పడం ఆసక్తికరంగా మారింది.

దర్యాప్తు సంస్థల ఫోకస్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కూతురు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె సెల్‌ఫోన్లలోని డేటాపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతున్నది. అవరసమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఈడీ అధికారులు ఆమెకు సమాచారమిచ్చారు. భవిష్యత్తులో ఆమె చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటికే ఈడీ దగ్గర పలు ఫిర్యాదు ఉండడంతో వాటిని కూడా టేకప్ చేస్తుందా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ప్రధానే అవినీతిని సహించే ప్రసక్తే లేదనడంతో కేసీఆర్ కుటుంబ ఆస్తులు, అవినీతిపైన ఏ రూపంలో యాక్షన్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. దీంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోపు తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు ఏ స్థాయికి చేరుకుంటుందోననే చర్చలు మొదలయ్యాయి. కవితతో మొదలైన ఈడీ దర్యాప్తు పరంపరం ఇకపైన ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో, ఇంకెన్ని కొత్త కేసులు నమోదవుతాయో అనే వార్తలు వినిపిస్తున్నాయి.

కర్నాటక ఎలక్షన్స్ తర్వాత ఏం జరగనున్నది?

ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఆ తర్వాత తెలంగాణపై సీరియస్ దృష్టి సారించనున్నది. కర్నాటక ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాజకీయంగా తెలంగాణలో బలపడాలని కోరుకుంటున్నది. కేసీఆర్ అవినీతి గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపు తదితరాలపై బుక్‌లెట్ రూపంలో ఇంటింటికీ బీజేపీ తనదైన శైలిలో క్యాంపెయిన్ చేపట్టనున్నది. ప్రభుత్వంపైనా, కేసీఆర్ పైనా ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవడంపై బీజేపీ ఇప్పటికే స్కెచ్ తయారుచేసింది. సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మాణం చేస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కుటుంబ పాలన అడ్డంకిగి మారిందనేది ఎక్స్ పోజ్ చేస్తూనే నీళ్లు నిధులు, నియామకాల విషయంలో వైఫల్యాన్ని ఎత్తిచూపాలనుకుంటున్నది.

Next Story