హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by Malleboina Mahesh |

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. వార్షిక శీతాకాల విడిది లో భాగంగా ఆమె ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.

హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. వార్షిక శీతాకాల విడిది లో భాగంగా ఆమె ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఆమెకు ఘనస్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.

రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, నిరంతర విద్యుత్ సరఫరా మరియు వైద్య సౌకర్యాలపై సీఎస్ శాంతి కుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి, కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి బస చేసే కాలంలో సామాన్యులకు రాష్ట్రపతి నిలయం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

కార్యక్రమాల షెడ్యూల్:

డిసెంబర్ 19: హైదరాబాద్‌లో నిర్వహించనున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభిస్తారు.

డిసెంబర్ 20: బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ‘టైమ్‌లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్’ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు.

డిసెంబర్ 22: పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.

Next Story