- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శీతాకాల విడిది హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. అధికారులతో సీఎస్ సమీక్ష
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల పై గురువారం డా.బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్. ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు శాఖ తగు భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని, వైద్య, ఆరోగ్య శాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడింగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో వుంచాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగలను పట్టుకోవడానికి ముందుస్తు ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీ.వీ ఆనంద్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి ఈ. శ్రీధర్, అదనపు డీజీపీలు మహేష్ భగవత్, GHMC కమిషనర్ ఆర్.వి.కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ Ch. ప్రియాంక, ప్రొటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.






