జనగణనకు ఏర్పాట్లు ముమ్మరం.. ఏకంగా 85 వేల మంది ఎన్యుమరేటర్లు

by Kema Shiva Kumar |

జనగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు.

జనగణనకు ఏర్పాట్లు ముమ్మరం.. ఏకంగా 85 వేల మంది ఎన్యుమరేటర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను మొదలుపెట్టారు. జనాభా లెక్కల్లో కీలకమైన ఎన్యుమరేటర్లు ఎంత మంది అవసరమైన ప్రాథమికంగా లెక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 75వేల బ్లాకుల ద్వారా జనగణన చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. బ్లాకులు కొంచెం అటు ఇటుగా మారుతాయని, దీంతోపాటుగా ఐదు శాతం ఎన్యుమరేటర్లను రిజర్వ్ లో ఉంచుకోవాల్సి ఉంటుందనే అంచనాతో దాదాపుగా 85 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరం అవుతారని అంచనా వేశారు.

వారిలో పాటుగా మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇతర మండల, జిల్లా స్థాయి అధికారులు అందరు కలిపి ఐదు వేల మంది వరకు అవసరమవుతారని లెక్కలు వేశారు. వారిలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు జనాభా లెక్కల్లో నిమగ్నం కావాల్సి ఉంటుందని జనాభా లెక్కల అధికారులు తెలిపారు. వీరు జనాభా లెక్కల్లో పాల్గొంటున్నందుకు కేంద్ర ప్రభుత్వ వేతనానికి అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ 750 నుంచి 850 మంది జనాభా లేదా 180 నుంచి 200 వరకు ఇండ్లను ఎన్యుమరేటర్ బ్లాక్ (ఈబీ) లను కేటాయిస్తారు. వీటిల్లో జనగణన, కులగణన చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో జనాభా అత్యంగా వేగంగా పెరిగడంతో పాటు నగరం కూడా విస్తరించింది.

ఒక్కో గేటెడ్ కమ్యూనిటీలో, ఒక్కో బ్లాక్ లో 40–50 ఆంతస్తుల్లో భవనాలను నిర్మించారు. నగర శివారులో పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు వచ్చాయి. ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిల్లో జనగణన ఒక సవాలుగా మారుదతుందని అధికారులు భావిస్తున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఒక్కో గేటెడ్ కమ్యూనిటీ పెద్ద రెవెన్యూ గ్రామం కంటే ఎక్కువగా ఇండ్లు, జనాభా ఉన్నాయి. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది వేలకు పైగా ఎన్యుమరేటర్ బ్లాక్లు ఉంటాయని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.

ఉపాధ్యాయులు ఎంతమంది?

ఎన్యుమరేటర్లుగా 85 వేల మంది అవసరం కావడంతో జిల్లాలు, మండలాల ప్రభుత్వ టీచర్లు ఎంత మంది ఉన్నారనే లెక్కలు మొదట తీయాలని నిర్ణయించారు. అప్పటికి కూడా సరిపోకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ, అంగన్వాడి, ఆశ వర్కర్లు ఉద్యోగులు, వివిధ శాఖల ఇంజినీర్ల సేవలు వినియోగించుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. టీచర్ల లెక్క తరువాత కానీ ఇతర శాఖల వారు ఎంత మంది అవసరమనేది లెక్కలు వేయనున్నారు. పట్టణాల్లో అత్యంత వేగంగా జనాభా పెరగడం, విస్తరించడంతో ఇక్కడ ఓటరు జాబితా ప్రకారం ఎన్యుమరేటర్లను కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

షెడ్యూల్ ఇదే...

ఎన్యుమరేటర్లు వచ్చే ఏప్రిల్ నుంచి మే లోగా హౌస్ లిస్టింగ్ జాబితాను తయారు చేస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి పెద్దకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజలు పాటుగా సాగుతుంది. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు పాపులేషన్ ఎన్యుమరేషన్ జరుగుతుంది. ఈ దశలో కుటుంబసభ్యుల వివరాలను, వారికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తీసుకుంటారు. మార్చి 1 నుంచి 5 వరకు హౌస్ లెస్ (ఇళ్లు లేని వారు) రోడ్ల మీద జీవనం సాగించే వారు, ఫుట్పాత్లు, సంచారజీవనం సాగించే వారి వివరాలను ప్రత్యేకంగా తీసుకుంటారు. కుటుంబసభ్యుల సమాచారం తెలుసుకోవడానికి ఇప్పటికే 34 ప్రశ్నలతో ప్రశ్నావళిని కేంద్రం రూపొందించింది. అయితే వీటిలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని, అదనంగా కులం అనే ప్రశ్నను చేరుస్తారని, త్వరలోనే ప్రశ్నావళిని జనాభా లెక్కల విభాగం ఖరారు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒకటి రెండు ప్రశ్నలు మినహా 35–36 వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Next Story