ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం.. కేంద్రానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

by Ramesh Naini |

తెలంగాణలోని ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం.. కేంద్రానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. శనివారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ప్రి-బడ్జెట్ సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రాలతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు జరుపుతున్నందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే దేశం పురోగమిస్తుందన్నారు. బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఇది కీలకంగా నిలుస్తుందన్నారు.

దేశ జీడీపీలో 10 శాతం వాటా టార్గెట్..

2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన అభినందించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతంగా ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ఆవిష్కరించామని, 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 200 బిలియన్ డాలర్ల నుంచి 3 ట్రిలియన్ డాలర్లకు పెంచి, దేశ జీడీపీలో 10 శాతం వాటా సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తెలంగాణలో పెట్టుబడి రేటును ప్రస్తుత 37 శాతం నుంచి 50 శాతానికి (GSDPలో) పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితిని కనీసం 4 శాతానికి పెంచాలని, రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చి, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కోరారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను FRBM పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తన మొత్తం వ్యయంలో 20 శాతానికి పైగా రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తోందని, అందులో 25 శాతం తగ్గించి రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని సూచించారు. సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చేరడంతో 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన 41 శాతం పన్ను బదిలీ ఉన్నప్పటికీ, రాష్ట్రాలకు కేవలం 30 శాతం మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.1.55 లక్షల కోట్ల సర్‌ఛార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలి లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు.

RRR ప్రాజెక్టు మంజూరు చేయాలి

ప్రాజెక్టుల అంశంలో తెలంగాణకు కీలకమైన ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని, మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించాలని కోరారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాల మంజూరుకు డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (PRLI) జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని అభ్యర్థించారు. అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు రూ.14,100 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.45,000 కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళికకు రూ.17,212 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.

Next Story