Pratyusha: సినీనటి ప్రత్యూష కేసు.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-17 05:57:29  IST  )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

Pratyusha: సినీనటి ప్రత్యూష కేసు.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినీనటి ప్రత్యూష (Pratyusha) కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ వెంటనే లొంగిపోవాలని తీర్పును వెలువరించింది. అందుకు 4 వారాల పాటు సమయం ఇచ్చింది. అదేవిధంగా ఈ కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వేసిన శిక్షను సైతం సుప్రీం ధర్మాసనం సమర్థించింది.

అసలు ఏం జరిగిందంటే...

కాగా, 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష తన స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే, ప్రత్యూష ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ మృతిచెందగా.. సిద్ధార్థ్ రెడ్డి చికిత్స తర్వాత కోలుకున్నారు. ఈ క్రమంలోనే తన కూతురు ప్రత్యూషది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్‌తో అత్యాచారం చేసి చంపారని తల్లి సరోజినీ దేవి (Sarojini Devi) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి స్నేహితురాలు ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని దోషిగా తేలుస్తూ 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించారు. దీంతో సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2011లో సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు శిక్షా కాలాన్ని 2 ఏళ్లకు తగ్గిస్తూ.. జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ తీర్పునిచ్చింది. అక్కడితో ఆగని సిద్ధార్థ్ రెడ్డి తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు శిక్షను అమలు చేయాల్సిందేనని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లుగా తుది తీర్పును వెలువరించింది.

Next Story