పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత.. 300 మందికి పైగా టాపర్లు

by Gantepaka Srikanth |

విద్యారంగంలో తమదైన ముద్ర వేస్తూ, అసాధారణ ఫలితాలతో దూసుకుపోతున్న డీపీఎస్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మరోసారి విజయకేతనం ఎగురవేశాయి.

పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత.. 300 మందికి పైగా టాపర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యారంగంలో తమదైన ముద్ర వేస్తూ, అసాధారణ ఫలితాలతో దూసుకుపోతున్న డీపీఎస్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మరోసారి విజయకేతనం ఎగురవేశాయి. ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, 95 శాతానికి పైగా మార్కులతో 300 మందికి పైగా విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో, విజేతలను గౌరవిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో 'టాపర్స్ ఫెసిలిటేషన్ సెర్మనీ'ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విద్యార్థులకు పురస్కారాలు అందజేసి ప్రసంగించారు. డీపీఎస్ అంటే కేవలం పాఠశాల పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. డీ అంటే డిసిప్లిన్ (క్రమశిక్షణ), పీ అంటే పర్ఫెక్షన్ (పరిపూర్ణత), ఎస్ అంటే సింప్లిసిటీ (సరళత).. ఈ మూడు లక్షణాల కలయికే చైర్మన్ మల్కా కొమరయ్య" అని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై పట్టు సాధించాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండి లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు భవిష్యత్తులో తాము చదువుకున్న స్కూళ్లకే ముఖ్య అతిథులుగా రావాలని ఆకాంక్షించారు.

డ్రీమ్ బిగ్.. వర్క్ హార్డ్: మల్కా కొమరయ్య..

పాఠశాలల చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్, స్టే ఫోకస్డ్ అనే మూడు సూత్రాలే జీవితాన్ని మారుస్తాయన్నారు. కేవలం మార్కుల కోసమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే విలువల కోసం చదవాలని సూచించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఆ మార్పులో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. సంస్థ సీఈఓ మల్కా యశస్వి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. పల్లవి గ్రూప్ ప్రతినిధి సుశీల్ మాట్లాడుతూ.. విజయం వినయాన్ని నేర్పాలని హితవు పలికారు. నగరంలోని బోయిన్‌పల్లి, అల్వాల్, ఏవీఐఎస్, బోడుప్పల్, కీసర, గండిపేట్, సరూర్ నగర్ బ్రాంచ్‌లతో పాటు నాచారం, మహేంద్ర హిల్స్, నాదర్గుల్ డీపీఎస్ బ్రాంచ్‌ల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచ్‌ల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




Next Story