నల్గొండ కోర్టు సంచలన తీర్పు పై స్పందించిన ప్రణయ్ తండ్రి బాలస్వామి

by Malleboina Mahesh |   (  Updated:2025-03-10 08:58:30  IST  )

మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 18న జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసు (honor killing)లో నల్లగొండ జిల్లా కోర్టు (District Court) ఈ రోజు సంచలన తీర్పును ప్రకటించింది.

నల్గొండ కోర్టు సంచలన తీర్పు పై స్పందించిన ప్రణయ్ తండ్రి బాలస్వామి
X

దిశ, వెబ్ డెస్క్: మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 18న జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసు (honor killing)లో నల్లగొండ జిల్లా కోర్టు (District Court) ఈ రోజు సంచలన తీర్పును ప్రకటించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష (hanging), మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు (life imprisonment) విధిస్తూ.. కోర్టు తీర్పునిచ్చింది. ఈ హత్యకు ప్రధాన కారణం అయిన మారుతి రావు 2020లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ కేసులో కోర్టు తుది తీర్పు వెల్లడించింది. కాగా కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామని అన్నారు.

జస్టిస్‌ ఫర్ ప్రణయ్‌ (Justice for Pranay) అంటూ పోరాటం చేశామని.. అయినప్పటికి ప్రణయ్ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయని, అలాటి హత్యలు చేసిన వారందరికీ ఈ రోజు కోర్టు తీర్పుతో కనువిప్పు కలగాలని అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉండి శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని.. ఇలాంటి హత్యలకు పాల్పడడం విచారకరమని, ఈ రోజు కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని ఈ సందర్భంగా ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు కుమారుడి సమాధి వద్దకు వెళ్లిన ప్రణయ్ కుటుంబ సభ్యులు.. తమ కుమారునికి నివాళులర్పించారు. కుమారుడి సమాధిపై పూలు చల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Next Story