రేపు ‘కాళేశ్వరం’పై పీపీటీ.. NDSA నివేదికలోని అంశాలపైనా చర్చ

by Kema Shiva Kumar |

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. దాని లోపాలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

రేపు ‘కాళేశ్వరం’పై పీపీటీ.. NDSA నివేదికలోని అంశాలపైనా చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. దాని లోపాలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల బనకచర్ల, గోదావరి, కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించిన ప్రభుత్వం.. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై ప్రజాప్రతినిధులకు వివరించనుంది. ఎన్డీఎస్ఏలో నివేదించిన ప్రాజెక్టు లోపాలపై అవగాహన కల్పించనుంది. ప్రజాభవన్ వేదికగా ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ పీపీటీకి సీఎం రేవంత్‌రెడ్డి సైతం హాజరవుతారని సమాచారం.

కుంగిన మేడిగడ్డ పిల్లర్లు

కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇంజినీరింగ్ అద్భుతం అంటూ కేసీఆర్, బీఆర్ఎస్ బృందం చాలా సందర్భాల్లో గొప్పలు చెప్పుకుంది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన లోపాలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన రెండు పిల్లర్లు పది మీటర్ల లోతులోకి కుంగిపోయాయి. దాంతో ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వేల కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు లోపాలను తెలుసుకునేందుకు వెంటనే ఎన్డీఎస్‌ఏ రంగంలోకి దిగింది. ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించింది. వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం నిర్మాణం, నాణ్యత లోపాలు, చేసిన ఖర్చు.. తదితర వాటిపై కమిషన్ విచారించింది. ప్రస్తుతం ఈ కమిషన్ విచారణ సైతం చివరి దశలో ఉంది.

ఎన్డీఎస్ఏ నివేదికలో బట్టబయలు

ఎన్డీఎస్ఏ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయని తేల్చి చెప్పింది. మేడిగడ్డతోపాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లను మరోసారి పరిశీలించాలని సూచించింది. అలాగే.. మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను బాగు చేయడం సాధ్యం కాదని.. ఇక్కడ గేట్లు నిర్వహించడానికి వీలులేదని చెప్పింది. ఈ బ్లాకును పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని సూచించింది. మొత్తంగా 3 బ్యారేజీల్లోనూ నాణ్యత, డిజైన్ లోపాలతో స్ట్రక్చరల్ సమస్యలు వచ్చినట్లు వెల్లడించింది. దాంతో అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన తప్పిదాన్ని ఎత్తిచూపుతూనే ఉన్నది. కేవలం కమీషన్ల కోసం నాసిరకం పనులతో ప్రజాధనాన్ని నీళ్లపాలు చేశారని, రూ.వేల కోట్లు దండుకు తిన్నారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్(కేఐపీసీఎల్‌) పేరుతో రూ.వేల కోట్ల రుణాలను సమీకరించింది. దాంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సీఎం, మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఈ వైఫల్యాలన్నింటినీ ఫొటోలు, వీడియోలు, నిపుణుల నివేదికలతో సహా పీపీటీలో ప్రదర్శించాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన నేరాలను వివరించాలని నిర్ణయం తీసుకుంది.

బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా..

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బనకచర్ల విషయంలో గత బీఆర్ఎస్ తప్పిదాలను తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు వివరిస్తూ ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించింది. అంతకుముందు సచివాలయం వేదికగా అఖిలపక్షం ఎంపీలకు పీపీటీ ఇచ్చారు. అయితే.. తాజాగా మరోసారి కాళేశ్వరం, ఎన్డీఎస్ఏ రిపోర్టులో చూపిన ప్రాజెక్టు లోపాలు, ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితిపై పూర్తిస్థాయిలో వివరించేందుకు సిద్ధమైంది. మేడిగడ్డ డ్యామేజీ అయినప్పటికీ కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేసి వాడుకోవచ్చని ఇటీవల బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా 10 రోజుల్లో దానిపై కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో వారి విమర్శలను ఇప్పటికే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఖండించారు. నీటిని ఎత్తిపోస్తే ఎంత ప్రమాదమో వివరించారు. ఇక ఇప్పుడు.. సొంత పార్టీకే చెందిన ప్రజాప్రతినిధులకు దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి.. ప్రజల్లోకి బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేలా భవిష్యత్ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు లోపాలను వివరించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

Next Story