BRS: మాగంటి ఫ్యామిలీలో ఆధిపత్య పోరు?.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు కేసీఆర్ కు షాక్!

by Prasad Jukanti |

మాగంటి గోపీనాథ్ సతీమణిపై గోపీనాథ్ సోదరుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

BRS: మాగంటి ఫ్యామిలీలో ఆధిపత్య పోరు?.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు కేసీఆర్ కు షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ బైపోల్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టేశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని తిరిగి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా భర్తీ చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. జూబ్లీహిల్స్‌పై సీరియస్‌గా దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ స్థానాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. అభ్యర్థి ఎంపిక నుంచి అనుసరించాల్సిన వ్యూహాల వరకు అన్ని అంశాలపై లోతుగా చర్చలు జరుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో మాగంటి గోపీనాథ్ కుటుంబంలో ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

టికెట్ రేస్‌లో నేనూ ఉన్నా:

తమకు చావో రేవో అనేలా మారిన జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో గులాబీ పార్టీ ప్రణాళికలు వేసుకుంటోంది. టికెట్‌పై తీవ్ర కసరత్తు చేస్తున్న కేసీఆర్ మాగంటి కుటుంబ సభ్యులను బరిలోకి దించితే సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలో నేనూ టికెట్ రేస్‌లో ఉన్నానంటూ మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వజ్రనాథ్.. గోపీనాథ్ భార్యకు లౌక్యం తెలియదని తమ సామాజికవర్గం ఆచారాల ప్రకారం భర్త చనిపోతే మూడు నెలల పాటు ఇంట్లో నుంచే బయటకే రాకూడదు. కానీ ఇవన్ని పక్కన పెట్టి ఆమె నియోజకవర్గంలో పర్యటనలు చేయడం, భర్త చనిపోతే పిల్లలను నియోజకవర్గంలో తిప్పడం ఏంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వజ్రనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలతో మాగంటి గోపీనాథ్ కుటుంబంలో టికెట్ కోసం ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

బీఆర్ఎస్ లో టెన్షన్:

అధికారం కోల్పోయాక వరుస ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్‌కు జూబ్లీహిల్స్ బైపోల్ ఓ సవాల్‌గా మారింది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కండువా మార్చడంతో పాటు పార్లమెట్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఈ ఉప ఎన్నిక ద్వారా తమ బలమేంటో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని నిత్యం విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఇక్కడ తమ జెండా పాతేందుకు కసరత్తు చేస్తుంటే మాగంటి కుటుంబంలో మొదలైన ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరిగితే ఎలా అనే టాక్ వినిపిస్తోంది.

Next Story