కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ కోతలు: హరీశ్ రావు

by Prasad Jukanti |

ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో అప్రకటిత కరెంట్ కోతలు పెరిగాయని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ కోతలు: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక, ముందుచూపు లేకపోవడం వల్లే తెలంగాణ అంధకారంలోకి నెట్టబడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు, విద్యార్థులు, వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్తగా ఉండేదని, కానీ నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పీపీటీలు పెట్టి హెచ్చరించినా మేల్కోలేదు:

విద్యుత్ కోతలను నిరసిస్తూ ఈరోజు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సబ్‌స్టేషన్ల ముందు రైతాంగం ధర్నాలు చేపట్టిందన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్లే కరెంట్ కోతలు వస్తున్నాయని హరీశ్ రావు అన్నారు. సింగరేణి బొగ్గు నిల్వలపై తాము ముందే పీపీటీలు పెట్టి హెచ్చరించినా ప్రభుత్వం నిద్రలేవలేదన్నారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్‍లలో కేవలం 6 నుంచి 7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని ఆరోపించారు. యాదాద్రి ప్లాంట్‌లో యూనిట్-1, యూనిట్-4లో బొగ్గు లేక ఉత్పత్తి నిలిచిపోగా, భద్రాద్రి ప్లాంట్‌లో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి ఆగిపోయిందన్నారు. అసలు విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, రాష్ట్రంలో లోడ్ కేవలం 15 వేల మెగావాట్లు మాత్రమే ఉందని

7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి జరగడం లేదన్నారు. నిన్న కేవలం 3,190 మెగావాట్ల సామర్థ్యం మేర ఉత్పత్తి జరిగిందని ఉన్న సామర్థ్యంలో కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని ఆరోపించారు.

అడ్డగోలు ధరలకు ఎందుకు కొంటున్నారు?:

బొగ్గు సరఫరాలో, నీటి నిల్వల నిర్వహణలో, విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. బొగ్గు, పవర్‌, సాండ్‌, ల్యాండ్‌ ఇలా కాంగ్రెస్ పాలన అంతా స్కాముల మయంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గి సరఫరా తగ్గిందని అందుకే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు పెడుతున్నారన్నారు. నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్లలో నీళ్లు నింపలేదు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని కూడా అసాధ్యం చేశారన్నారు. ముందస్తు ఆలోచనతో అయినా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సజావుగా జరిగేలా చూడలేదని. అడ్డగోలు ధరలకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పవర్ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేస్తున్నారని ఆ భారం వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు.

సింగరేణి వెబ్‌సైట్ మూసివేసి ఉత్పత్తి:

సింగరేణి వెబ్‌సైట్ మూసివేసి ఉత్పత్తి, సరఫరా, బొగ్గు నాణ్యత వివరాలు బయటకు రాకుండా చేశారు. నాణ్యమైన సింగరేణి బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు పంపుతున్నారు. తెలంగాణకు మాత్రం లో-క్వాలిటీ బొగ్గు పంపిస్తున్నారని ఆరోపించారు. 70 రేకులు పంపితే 30 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి. అందుకే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదన్నారు. రాష్ట్ర అవసరాలు, రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎందుకు పంపిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. మీ దగ్గర బొగ్గు ఉండి కూడా అడ్డగోలు ధరలకు పవర్ ఎక్స్ఛేంజ్‌లో విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? ఎందుకు కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. త్రీ ఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు రాత్రంతా పొలం వద్ద జాగారం చేయాల్సి వస్తోందన్నారు. మీది కోతల సర్కార్... వాతల సర్కార్ అన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర రైతాంగం తరఫున బీఆర్ఎస్ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.

Next Story