- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవర్ ఛేంజర్స్ పట్టణ ప్రజలే..! మారనున్న రాజకీయ ముఖచిత్రం
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం సమీప భవిష్యత్తులోనే మారనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం సమీప భవిష్యత్తులోనే మారనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో పట్టణ ప్రజలే నిర్ణయించే రోజులు రానున్నాయి. మొన్నటివరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కానీ సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పట్టణ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని మరీ నడుచుకోవాల్సిన రోజులు త్వరలోనే రానున్నట్లు తెలుస్తున్నది. 2028లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు చేరనున్నది. లోక్‌సభ స్థానాలు 17 నుంచి 25కి (కొత్తగా 8 స్థానాలు) పెరిగే అవకాశం ఉంది. ఇందులో మహిళలకు 51 అసెంబ్లీ సీట్లు రిజర్వ్కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తీర్పును పట్టణ ప్రాంత ప్రజలు శాసిస్తారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతున్నది. ఉపాధి, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇక్కడికి వలసలు పెరగడంతో పట్టణ ప్రాంత జనాభా విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టంగా పడనుంది.
త్వరలోనే 45 నుంచి ౫౦ శాతానికి పట్టణ జనాభా..
తెలంగాణలో ప్రస్తుతం 45 శాతం పట్టణ జనాభా ఉన్నట్టుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పట్టణ జనాభా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రభుత్వం ఔటర్లోపలి మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాలు అన్నింటినీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పట్టణ జనాభా మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పునర్విభజన నాటికి ఉండే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు. దీంతో అప్పటి వరకు పట్టణ జనాభా 50 శాతం వరకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల 40 స్థానాలు
సమీప భవిష్యత్‌లో హైదరాబాద్‌ను అనుకుని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలైన ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణాలతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 40 దాటనుంది. వీటితో పాటు ఔటర్బయట 30 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. ఇవి 30 సెగ్మెంట్లుగా ఏర్పాటు కానున్నాయి. ఇవే కాకుండా వరంగల్‌లో ఇప్పటికే రెండు పూర్తి పట్టణ నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన నాటికి అవి మూడుకు చేరుకోనున్నాయి. జిల్లా కేంద్రాలు కాకుండా రామగుండం, మిర్యాలగూడ, హుజురాబాద్, సత్తుపల్లి, నర్సంపేట లాంటి పట్టణాలు సైతం నియోజకవర్గ కేంద్రాలుగా పట్టణ ప్రాంత ఓటర్ల ఆధిపత్యం కనపడనుంది. వీటితో పాటు ఆలేరు, తుంగతుర్తి, డోర్నకల్లాంటి నియోజకవర్గాల్లో రెండు చొప్పున మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా జిల్లా కేంద్రాలు కాకుండా మరో 10 వరకు పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలుగా మారనున్నాయి. ఇలా తెలంగాణలో మొత్తం 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు పట్టణ ప్రాంత ఓటర్ల డామినేషన్‌తో ఏర్పాటు కానున్నాయి.
పట్టణ ప్రజల నిర్ణయం మేరకు..
తెలంగాణలో గ్రామీణ ప్రాంత ప్రజల అభిరుచులు, ఆలోచనలు ఒకలా ఉంటే.. పట్టణ ప్రాంత ప్రజల అభిరుచులు మరోరకంగా ఉంటాయి. ఒక్కోసారి ఈ రెండు ప్రాంతాల ప్రజలు పూర్తి భిన్నంగా ఎన్నికల ఫలితాలను ఇచ్చిన రోజులూ ఉన్నాయి. 2014లో ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది కానీ, ఆ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ఒకటి, రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్ల నిర్ణయానికి భిన్నంగా ఓటుతో తీర్పునిచ్చారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక్కడ సైతం గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్ల ఆలోచనకు భిన్నంగా తీర్పునిచ్చారు. దీంతో రెండు ప్రాంతాల ప్రజల ఆలోచన భిన్నంగా ఉన్నాయనేది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది.






