స్కాలర్‌షిప్‌ దరఖాస్తుల గడువు పెంపు.. కొత్త, రెన్యువల్ అవకాశం

by Ramesh Naini |   (  Updated:2026-03-26 16:07:48  IST  )

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (కొత్త, పునరుద్ధరణ) దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

స్కాలర్‌షిప్‌ దరఖాస్తుల గడువు పెంపు.. కొత్త, రెన్యువల్ అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (కొత్త, పునరుద్ధరణ) దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈపాస్ (ePASS) పోర్టల్ ద్వారా కళాశాలలు, విద్యార్థులు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 20వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ (PMS) పథకం కింద స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. నిధుల మంజూరులో పారదర్శకత కోసం ప్రభుత్వం http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గత ఏడాది జులై 1న ప్రారంభమైన ఈ నమోదు ప్రక్రియ గడువు ఈ నెల 31తో ముగియాల్సి ఉండగా.. ఇంకా లక్షకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో గడువును ఏప్రిల్ 20కి పొడిగించారు.

ఇంకా 1.25 లక్షల మంది పెండింగ్..

ఎస్సీ డీడీ కమిషనర్ అందించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్‌షిప్‌ల కోసం 10,89,253 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు 9,64,243 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇంకా 1,25,010 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కొత్త దరఖాస్తులు.. ఇప్పటివరకు 3,70,375 మంది నమోదు చేసుకోగా.. ఇంకా 87,639 మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పునరుద్ధరణ (రెన్యువల్).. ఇప్పటివరకు 5,95,868 మంది నమోదు చేసుకోగా.. ఇంకా 37,371 మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

కళాశాలలు, అధికారులకు ఆదేశాలు

ఏప్రిల్ 20వ తేదీలోగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థులందరూ తమ డేటాను ఈపాస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేలా అన్ని నియంత్రణ సంస్థలు, కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సబ్యసాచి ఘోష్ ఆదేశించారు. ఈ గడువు పెంపుపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు అన్ని సంక్షేమ శాఖలు విస్తృత ప్రచారం నిర్వహించి, గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని ఆయన సూచించారు.

Next Story