- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ వ్యతిరేక ఓట్ల తొలగింపే లక్ష్యం.. ఎస్ఐఆర్‌పై పొన్నం సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించనున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటరు సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) అందించే ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి అర్హులైన ఓటరికి చేరేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ-2లు) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు తమ పరిధిలోని బూత్ లెవల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే బీఎల్ఏలకు అందజేయాలని, బీఎల్ఏలు (డీసీసీ అధ్యక్షులు) ఆయా జాబితాలను ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్వోలు) సమర్పించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. 2002లో జరిగిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించకుండా అధికారులు వ్యవహరించారని గుర్తు చేసిన మంత్రి, ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులు కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్ర
ఈ ఓటరు సవరణ ప్రక్రియలో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్ర చేస్తుందని, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో లక్షలాది ఓట్లను తొలగించారని తెలంగాణలో అలా జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం సూచించారు. ప్రతి డివిజన్, ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారికి చేరేలా చూడాలని, ఓటరు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించకపోతే జూలై 30న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు తొలగిపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరణించిన లేదా అనర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే, అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని పొన్నం సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులను గుర్తించి నమోదు చేయించాలని, బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలోని తప్పులను గుర్తించి సకాలంలో ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ప్రతి కాంగ్రెస్ నాయకుడు తన పరిధిలో బూత్‌ల వారీగా సమీక్షలు నిర్వహించి, ప్రజలకు దరఖాస్తుల నింపడం, ఆన్‌లైన్ నమోదు వంటి అంశాల్లో సహాయం అందించాలని మంత్రి పొన్నం కోరారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలి
ఓటరు సవరణ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేలా పార్టీ బలోపేతం దిశగా ప్రతి నాయకుడు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి అజారుద్దీన్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేశ్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్, సయ్యద్ ఖలీద్ సైఫుల్లా గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.






