స్టేట్​ ఇన్ స్పైర్ ఎగ్జిబిషన్​కు ఎంపికైన గురుకుల స్టూడెంట్స్​ ను అభినందించిన పొన్నం ప్రభాకర్

by Muthe.Rajitha |

రాష్ట్రస్థాయి ఇన్ స్పైర్ ప్రదర్శనకు గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు.

స్టేట్​ ఇన్ స్పైర్ ఎగ్జిబిషన్​కు ఎంపికైన గురుకుల స్టూడెంట్స్​ ను అభినందించిన పొన్నం ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రస్థాయి ఇన్ స్పైర్ ప్రదర్శనకు గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన సైన్స్​ ఎగ్జిబిషన్​ పోటీల్లో బీసీ గురుకులాల 50 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చారు. శుక్రవారం ఎంజేపీ సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యకంగా అభినందించారు. ఈసందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. విద్యార్థులు తమ తెలివితేటలతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, వారి లోని ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ వారిని ఇన్ స్పైర్ లాంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. సామాజిక ప్రయోజనం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ తయారు చేసేలా విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయాలన్నారు. విద్యార్ధి దశ నుంచి సరికొత్త ఆవిష్కరణలతో విద్యార్థులు రాణించినప్పుడే భవిష్యత్ లో వారు గొప్పగొప్ప సైంటిస్ట్ లుగా ఎదుగుతారన్నారు.

విద్యార్థులకు కావల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, విజ్ఞానం పెంచుకోవడం, సృజనాత్మకత పెంపొందించుకోవడం ద్వారా తమ భవిష్యత్ ను గొప్పగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ఇన్ స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైనా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లో పదివేల రూపాయలు జమ అవుతాయని, ఈ డబ్బుతో వారి ఆలోచన మేరకు ప్రాజెక్ట్ ను చేసి ప్రదర్శనలో ఉంచాలని ఆయన సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులను స్కూల్ స్థాయి నుంచే భాగస్వామ్యులను చేసేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న పది నుంచి 15 ఏళ్ల వయస్సు గల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 50 మంది బీసీ గురుకుల విద్యారులు ఎంపిక కావడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.భవిష్యత్ లో ఇలాంటివి మరెన్నో సాధించాలని సూచించారు. ఉప్యాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story