Ponnam Prabhakar: కేసీఆర్ ఫ్యామిలీలో సర్వేలో పాల్గొన్నది కవిత ఒక్కరే.. కులగణనపై విమర్శలొద్దు: పొన్నం

by Prasad Jukanti |   (  Updated:2025-02-03 07:46:24  IST  )

కులగణనపై విమర్శలు బీసీలపై దాడేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Ponnam Prabhakar: కేసీఆర్ ఫ్యామిలీలో సర్వేలో పాల్గొన్నది కవిత ఒక్కరే.. కులగణనపై విమర్శలొద్దు: పొన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కులగణనపై విమర్శల దాడిని బీసీలపై దాడిగానే భావిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. అధికారంలో ఉండగా బలహీనవర్గాలకు న్యాయం చేయని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు విమర్శలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని సూచించారు. ఇవాళ మంత్రి పొన్నం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ (KCR) రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే ఆయన రేపు అసెంబ్లీకి వస్తారని అభిప్రాయపడ్డారు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలని కోరారు. బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపాలని పిలుపునిచ్చారు.

సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెడతాం

నిర్ణీత గడువులో కులగణన చేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రశంసించారు. కులగణనకు స్ఫూర్తినిచ్చిన రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ధన్యవాదాలు తెలిపారు. ఈ విప్లవాత్మక మార్పును స్వాగతిస్తూ అన్ని జిల్లాల్లోని బలహీన వర్గాల నాయకులు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సర్వేను రేపు కేబినెట్, ఆ తర్వాత అసెంబ్లీలో ఉంచుతామన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా సర్వేలు జరిపి ఆ లెక్కలు బీరువాలకే పరిమితం చేయడం లేదని, కులగణన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని వెల్లడించారు. గుడ్డుపై ఈకలు పీకిన చందంగా బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో రాజకీయపరమైన దాడి చేయవద్దని చురకలంటించారు.

వివరాలు ఎందుకివ్వలేదో కవిత ప్రశ్నించాలి

కులగణనకు కొన్ని కుటుంబాలు సహకరించలేదని మంత్రి వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో ఎమ్మెల్సీ కవిత (Kavitha) మాత్రమే సర్వేలో తమ కుటుంబ వివరాలు ఇచ్చారని తెలిపారు. సర్వేలో భాగస్వామ్యం కాని వారిని ఎందుకు పాల్గొనలేదో కవిత ప్రశ్నించాలని కోరారు. కులగణన విషయంలో ఎదైనా సలహాలు సూచనలు ఇస్తే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వినడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగాయని అనిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇది పార్టీ పరంగా జరిగిన సర్వే కాదు.. ప్రభుత్వ పరంగా జరిగినదని స్పష్టంచేశారు.

Next Story