- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరం నడిబొడ్డులో పేదలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని చూసి బీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర అసహనానికి గురవుతున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గురువారం సెక్రెటేరియట్‌లోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, దరఖాస్తులు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతంలోనే వారి సొంతింటి కలను నెరవేర్చడానికి నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ఇళ్ల కోసం స్థానికంగా అందుబాటులో ఉన్న మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మీసేవ వాట్సాప్ నెంబర్ (8096958096), వెబ్‌సైట్ (meeseva.telangana.gov.in) ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పదేళ్ల పాలనలో వారు చేయలేని పనిని సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
ఉద్యోగాలు, ఉపాధి, పిల్లల చదువులు, వైద్య సౌకర్యాలకు 30-40 కిలోమీటర్ల దూరంలో కనీస వసతులు కల్పించకుండా అరకొరగా ఇళ్లను నిర్మించి అదే పేదల సంక్షేమమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ భూములను ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తూ పేదలకు శాశ్వత భరోసా కల్పించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే దానిపై ఎందుకు ఇంత విషప్రచారమని ప్రశ్నించారు. పేదోడు హైదరాబాద్‌లో ఉండకూడదా? నగరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములలో పేదలకు ఇళ్లు నిర్మించకూడదా? అని నిలదీశారు. ప్రభుత్వ భూములను పేదల కోసం వినియోగిస్తే ఎందుకింత కడుపుమంట అన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాలను, కపట నాటకాలను హైదరాబాద్ మహానగర ప్రజలు గమనించాలని.. పేదల సంక్షేమాన్ని అడ్డుకునే రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇందిరమ్మ టవర్స్‌గా మార్చి విక్రయిస్తారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారమే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
లబ్ధిదారుల మీద ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తోందని.. ఇది అమ్మకం కాదు, ప్రభుత్వ ఆర్థిక సహకారమన్నారు. లబ్ధిదారుడి వాటా అన్ని ప్రాంతాల్లో రూ.6 లక్షలు మాత్రమే అని.. ఫ్లాట్ల మార్కెట్ విలువ తొలి విడతలో ప్రారంభించనున్న 16 నియోజకవర్గాలలో రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఎస్‌ఆర్‌వో (బేసిక్) విలువ రూ.14.6 లక్షల నుంచి రూ.28.4 లక్షల వరకు ఉన్నదని.. దీంతో ప్రభుత్వం అందించే సబ్సిడీ, భూమి విలువ, నిర్మాణ వ్యయాన్ని కలిపి పేదలకు అత్యంత తక్కువ ధరలో గృహాలను అందించే అవకాశం కల్పిస్తున్నదని చెప్పారు. లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల విలువైన ఇల్లు సమకూరుస్తున్నదని.. ఇందులో లబ్ధిదారుడి వాటా కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమేని వెల్లడించారు. ఈ విష ప్రచారాన్ని ఇదేవిధంగా కొనసాగిస్తే జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో పట్టిన గతే రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని హెచ్చరించారు.






