జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవమైన‌ వచ్చే నెల 2వ తేదీ నుంచి భూ భార‌తి చ‌ట్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించ‌నున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు.

జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవమైన‌ వచ్చే నెల 2వ తేదీ నుంచి భూ భార‌తి చ‌ట్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించ‌నున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. గ‌త ప‌ది సంవ‌త్సరాల్లో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ స‌మ‌స్యల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపాల‌న్న ఆశ‌యంతో గ‌త నెల 14వ తేదీన భూ భార‌తి చ‌ట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల‌ మీదుగా ప్రారంభించామన్నారు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించామన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహిస్తున్నామ‌న్నారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని వ‌చ్చే నెల 2వ తేదీ నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించాల‌ని నిర్ణయించిన‌ట్లు బుధ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. ఈ రెవెన్యూ స‌ద‌స్సుల‌లో వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌కు నిర్ధేశిత గ‌డువు పెట్టుకొని భూ భార‌తి చ‌ట్టం ప‌రిధిలోకి వ‌చ్చే ప్రతి ద‌ర‌ఖాస్తుకు ప‌రిష్కారం చూపిస్తామ‌ని హామీ ఇచ్చారు.

60 శాతం పరిష్కారం

ప్రయోగాత్మకంగా నాలుగు మండ‌లాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టులో వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే కొన్నింటిని ప‌రిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 30 తేదీ నాటికి దాదాపు 60 శాతం భూ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరిస్తామ‌ని, భూభార‌తి చ‌ట్టానికి లోబ‌డి ప‌రిష్కరించవ‌ల‌సిన అన్ని స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం చూపుతామన్నారు. ప‌రిష్కరించ‌ లేని వాటికి ఎందుకు కారణాలు లిఖితపూర్వకంగా ద‌ర‌ఖాస్తుదారుల‌కు తెలియ‌జేస్తామ‌న్నారు. ఎప్పటికీ పరిష్కారం కానివి ఉంటే అసలు పరిష్కార యోగ్యం లేనివి, అక్రమమైనవి ఉంటే, అవి పరిష్కారం కావని చెప్తామన్నారు. భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలనేది భూ భారతి చట్టం లక్ష్యం. క్షేత్ర స్థాయిలో అధికారులు సత్వరం స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. రెండో ద‌శ‌లో 28 మండ‌లాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ స‌ద‌స్సుల‌లో కూడా ఈ నెల చివ‌రి నాటికి వీలైనంత‌ వ‌ర‌కు స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించాల‌ని ఇప్పటికే క‌లెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

కోర్టు కేసు తర్వాతే..

సాదాబైనామాల‌కు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు ప‌రిధిలో ఉంద‌ని, కోర్టులో స్టే వెకేట్ అయిన వెంట‌నే ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారం చూపిస్తామ‌ని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే ఆన్ లైన్ లో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామ‌న్నారు. ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రజ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించ‌డానికి గ‌త ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ విభాగంలో చేప‌ట్టిన సంస్కర‌ణ‌లు, తీసుకున్న నిర్ణయాల‌కు ప్రజ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తుంద‌న్నారు. భూ భార‌తి చ‌ట్టాన్ని ప్రజ‌లు స్వాగ‌తిస్తున్నార‌ని, ఈ చ‌ట్టం వ‌ల్ల త‌మ స‌మ‌స్యలు ప‌రిష్కార‌మ‌వుతున్నాయ‌న్న సంతోషం వారిలో క‌నిపిస్తుంద‌న్నారు. అలాగే స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంద‌న్నారు. గ‌త ప్రభుత్వం చేసిన నిర్వాకం వ‌ల్ల మొత్తం రెవెన్యూ సేవ‌లు ప్రజ‌ల‌కు దూర‌మ‌య్యాయ‌ని విమర్శించారు. మొత్తం వ్యవ‌స్థను ప్రజ‌ల‌కు దగ్గరికి చేసి, మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్రభుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు.

Next Story