- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం పార్లమెంట్ బరిలో పొంగులేటి!?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అధికారపార్టీని విభేదించి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సంవత్సర కాలం లోపే ఆ పార్టీని విజయతీరాలకు చేర్చిన నాయకుడు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపితమైన వేళ.. కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ విలవిలలాడిన నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం బరిలో నిలవబోయే అభ్యర్థి ఎవరన్న చర్చ ఇప్పటినుంచే మొదలైంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో ఖమ్మం జిల్లా కీలకమైన నేపథ్యంలో పొంగులేటి టీం నుంచే అభ్యర్థి బరిలోకి దిగడం ఖాయమనే భావన వ్యక్తమవుతుంది. పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీలో ఉండనున్నాడని, అతనైతేనే బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోగలడనే ప్రచారం జరుగుతుంది. - దిశ బ్యూరో, ఖమ్మం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అధికారపార్టీని విభేదించి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సంవత్సర కాలం లోపే ఆ పార్టీని విజయతీరాలకు చేర్చిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా ఛరీష్మా కలిగిన నాయకుడు. వైసీపీలో చేరిన కాలంలోనే తనతోపాటు మరో ముగ్గురిని జిల్లాలో గెలిపించుకున్న నాయకుడు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి 9 మందిని గెలిపించడంలో కీలకమైన నేత.. ప్రత్యక్షంగా రాజకీయ చట్రంలో శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తున్నా.. అతని వెనుక మరో కీలకమైన కాంగ్రెస్ నాయకుడు, అతని సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఎన్నికల రణరంగంలో ప్రధానంగా వ్యవహరించాడు. వ్యూహాలకు పదునుపెట్టి, అన్న సలహాలు, సూచనలు తీసుకుని పాలేరు నియోజకవర్గంలో 50వేలకు పైగా మెజార్టీతో శ్రీనివాస్ రెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన శపథంలో తన సోదరున్ని గెలిపించడమే కాకుండా.. జిల్లాలోని కొంత మంది అభ్యర్థుల గెలుపులో కూడా వ్యూహాలు సిద్ధం చేసి అమలు చేశాడు.
పార్లమెంట్ బరిలో ప్రసాద్ రెడ్డి..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో కీలకమైన నేతల అభిప్రాయం మేరకు ఆ అవకాశం ప్రసాద్ రెడ్డికే దక్కనుందని టాక్. బీఆర్ఎస్ నుంచి ఎంత బలమైన వ్యక్తి బరిలో ఉన్నా.. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం.. కాంగ్రెస్‌కు జనాధరణ ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి బెటర్ అనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పార్టీ శ్రేణులు, పొంగులేటి అభిమానులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పాలేరులో కీరోల్ పోషించిన ప్రసాద్ రెడ్డి..
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచినా.. ఎన్నికలు జరిగే నాటికి పూర్తిస్థాయిలో నియోజకవర్గానికే పరిమితమయ్యాడు ప్రసాద్ రెడ్డి. సోదరుడు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లినా, తక్కువ సమయం పాలేరులో కేటాయించినా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి కాంగ్రెస్ నాయకులు, శ్రేణులను సమాయత్తం చేశాడు. ఇంటింటికీ తిరుగుతూ ముమ్మర ప్రచారం చేశాడు. నాయకులను సమన్వయం చేస్తూ, ప్రత్యర్థి వ్యూహాలకు ప్రతివ్యూహాలను సిద్ధం చేసి అమలు చేయడంలో సక్సెస్ అయ్యాడు. తనే కాకుండా కుటుంబ సభ్యులను సైతం నియోజకవర్గంలో పర్యటించేలా చేసి విజయం సాధించాడు. ఫలితంగా అన్నకు తగిన తమ్మునిలా.. అన్న మాట జవదాటని లక్ష్మణునిలా 50 వేలకు పైగా మెజార్టీతో సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
మూడు నెలల ముందుగానే ప్రణాళికలు..
ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం.. ఎన్నికలకు సన్నద్ధం అయ్యారు. ఎన్నికలకు మూడు నెలలకు ముందుగానే నియోజకవర్గాలవారీగా కసరత్తు ముమ్మరం చేశారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చాలనే లక్షంగా సమిష్టిగా కష్టపడ్డారు. అన్నకు తోడుగా ప్రసాద్ రెడ్డి మొదటినుంచీ ప్రధాన భూమిక పోషించాడు. వివిధ కార్యక్రమాల కారణంగా ఢిల్లీ, హైదరాబాద్, ఇతర నియోజకవర్గాల్లో సోదరుడు శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తున్నా.. జిల్లా నాయకత్వాన్ని, శ్రేణులను ప్రసాద్ రెడ్డి భుజాలమీద వేసుకుని అందరినీ సమన్వయ పరిచాడు. ప్రసాద్ రెడ్డితో పాటు మేనల్లుడు, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి, మువ్వా విజయ్ బాబు, తూళ్లూరి బ్రహ్మయ్య, స్వర్ణకుమారి తదితరులు వెన్నంటే ఉండి సహకరించారు.
త్వరలో నియోజకవర్గాల్లో పర్యటనలు..
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రసాద్ రెడ్డి పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచి మరోసారి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని భావిస్తుండగా... అభిమానులు, నాయకులు సైతం ప్రసాద్ రెడ్డి బరిలో నిలవాలని, తప్పకుండా గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం, రాష్ట్ర నాయకుల నిర్ణయం మేరకు తనకు అవకాశం కల్పిస్తే తప్పకుండా బరిలో నిలుస్తానని, ఖమ్మంలో మరోసారి సత్తా చాటుతామని ప్రసాద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.






