- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాల నివృత్తికి కాల్ సెంటర్
హైదరాబాద్ నగరంలోని నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలోని నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పథకంపై ప్రజల్లో ఎలాంటి గందరగోళం, అపోహలు లేకుండా దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. శనివారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో స్పెషల్ కాల్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలు మధ్యవర్తులను నమ్మకుండా ఎలాంటి సందేహం ఉన్నా నేరుగా 040-24603572 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుందన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వివరాలు తెలియజేస్తారన్నారు.
లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా..
'క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7680 ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నాం. ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. మీసేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే తీసుకుంటాం. దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలిస్తాం. క్షేత్రస్థాయిలోనూ పరిశీలన ఉంటుంది. నిర్మిస్తున్న ఫ్లాట్ల సంఖ్య కంటే అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. పారదర్శకమైన విధానంలో లాటరీ ద్వారా ఇండ్లను కేటాయిస్తాం. దరఖాస్తుదారులు క్యూర్ పరిధిలో పదేళ్లుగా నివాసం ఉండాలి. క్యూర్ పరిధిలో సొంత ఇల్లు, ఫ్లాట్, ప్లాట్ ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
525 చదరపు అడుగుల్లో ఇల్లు..
'ఈ పథకం కింద ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇల్లు నిర్మిస్తున్నాం. ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు అన్ డివైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గజాల స్థలాన్ని కూడా లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తుంది. లబ్ధిదారులు కేవలం రూ.6 లక్షలు చెల్లిస్తే చాలు. అప్లై చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇతర డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. లాటరీ సమయంలో వీటిని సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.10 వేల చెల్లింపునకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తాన్ని వాపసు చేస్తాం. పరిశీలన, కేటాయింపు, వాపసు పూర్తయ్యేవరకు మీసేవ రశీదు, చెల్లింపు రశీదు, దరఖాస్తు సంఖ్య, మొబైల్ నెంబర్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవాలి' అని మంత్రి పొంగులేటి సూచించారు.






