- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్‌తో కలిసి కేరళలో పొంగులేటి ప్రచారం.. యూడీఎఫ్ జోష్
కేరళంలో ఈ సారి రాజకీయ మార్పు అనివార్యమని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేరళంలో ఈ సారి రాజకీయ మార్పు అనివార్యమని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. యూడీఎఫ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అలెప్పి నియోజకవర్గం మన్నన్‌చెరీ పంచాయితీలోని కవుంకల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో కలిసి మంత్రి పొంగులేటి స్థానిక అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తే తెలంగాణలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ మోడల్‌ను అక్కడ కూడా అమలు చేస్తామని, తెలంగాణలో అమలు చేస్తున్నట్లే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కేరళంలో కూడా ప్రవేశపెడతామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
కేరళంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, బీజేపీని కౌంటర్ చేయడం పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతోందని మంత్రి విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లిస్తున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల కొరత, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యలను పక్కనపెట్టి, రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేరళ ప్రజలు ఇప్పటికే సీపీఎం ప్రభుత్వంపై విసుగు చెందారని, ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేయాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. ప్రజలకు పారదర్శకత, అభివృద్ధి, సంక్షేమం అందించగల శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని, కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.






