- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ శాఖలో పీక్స్‌కు చేరిన పాలిటిక్స్.. కమిషనర్ల బదిలీల్లో ఎమ్మెల్యేల జోక్యం
పురపాలక శాఖలో రాజకీయం పెచ్చుమీరిపోయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పురపాలక శాఖలో రాజకీయం పెచ్చుమీరిపోయింది. అందుకు మున్సిపల్ కమిషనర్ల బదిలీలే నిదర్శనం. ఒక పక్క అధికారపార్టీనేతలు, ఎమ్మెల్యేల ఒత్తిడి, మరో పక్క పోస్టింగ్ ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేయడం వెరసి మున్సిపల్ కమిషనర్లకు తిప్పలు తప్పడంలేదు. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయడంతో సమస్య మొదలైందని అధికారపార్టీ నేతలు, అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో 160 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే 2013 వరకు 57 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. తర్వాత కొత్తగా పదింటిని ఏర్పాటు చేశారు. 2014 తర్వాత 74 పట్టణ స్థానిక సంస్థలను కొత్తగా ఏర్పాటు చేశారు. 2023 తర్వాత 17 కొత్త పట్టణ స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు.
గ్రేడింగ్ ఇలా..
ఉమ్మడి రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలకు ఉండాల్సిన మార్గదర్శకాలతో కూడిన జీఓ నెం.218 జారీ చేశారు. దీని ప్రకారం నగర పంచాయతీల్లో 25వేల జనాభా, గ్రేడ్ -3 మున్సిపాలిటీలో 40వేలు, గ్రేడ్-2 మున్సిపాలిటీలో 50వేలు, గ్రేడ్-1 మున్సిపాలిటీలో లక్షకుపైగా జనాభా ఉండాలని నిర్ణయించారు. తర్వాత స్పెషల్ గ్రేడ్, సెలెక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా నిబంధనలు రూపొందించారు. దీని ప్రకారమే మున్సిపల్ కమిషనర్లకు పోస్టింగ్ కూడా ఇచ్చేవారు. అయితే 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది.
ఎమ్మెల్యేల జోక్యం
ఈ మధ్య ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ కమిషనర్ పోస్టింగ్ విషయంలో ఇద్దరు మాజీ మంత్రులు, ఓ కీలక నేత జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రామగుండం, కరీంనగర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లలో ఐఏఎస్ అధికారులు, నిజామాబాద్ లో జిల్లా పరిషత్ సీఈఓ ఉన్నారు. మిగిలిన పదింటిలో మీర్ పేట్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, బడంగ్ పేట్ లో సెక్షన్ ఆఫీసర్ క్యాడర్ ఆఫీసర్ ఉన్నారు. ఫీర్జాదిగుడలో గ్రేడ్-1, మహాబుబ్ నగర్, కొత్తగూడెం, నిజాంపేట్, జవహర్ నగర్, బండ్లగుడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ ఉన్నారు.
మున్సిపల్ వర్సెస్ ట్రెజరీ
పురపాలకశాఖలోని మున్సిపల్ కమిషనర్ల బదిలీల్లో గ్రేడింగ్ విధానం పాటించకోవడం కారణంగా ట్రెజరీ శాఖ వేతనాలు నిలిపేసింది. అయితే గ్రేడింగ్ విధానం లేకపోయినా అధికారుల క్యాడర్ కు తగిన పోస్టింగ్ ఇవ్వకుండా రాజకీయ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పురపాలకశాఖ అధికారులు చెబుతున్నారు. మరో పక్క మున్సిపాలిటీ గ్రేడింగ్ ఆధారంగానే పోస్టింగ్ ఇవ్వాలని, అలా చేస్తేనే వేతనాలు ఇస్తామని ట్రెజరీ శాఖ అధికారులు చెబుతున్నారు. అసలు వేతనాలు ఎందుకివ్వడంలేదో రాతపూర్వకంగా తెలియజేస్తే ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






