- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీట్ల పెంపుపై వీడని ఉత్కంఠ.. జనగణన తర్వాతే జాతకం
పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో రాజకీయ ఆశావహులు నిరాశ చెందుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో రాజకీయ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. ముఖ్యంగా మహిళ, కొత్త, యువ నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. 2014లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణలోని 119 సీట్లను 154కు పెంచాలని పేర్కొన్నారు. దీంతో సీట్లు పెరిగితే తమకు అవకాశాలు లభిస్తాయని రాజకీయ నాయకులు భావించారు. పోటీ చేయడానికి సిద్ధమై.. స్థానికంగా బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేశారు. కానీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చట్టంలోని ఆ అంశాన్ని అమలు చేయలేదు. సీట్లు పెంచాలని తెలంగాణ, ఏపీకి చెందిన నేతలు అనేక మార్లు విన్నవించినా స్పందించలేదు. దీంతో కొత్త నేతలు, యువతరానికి అవకాశాలు లేకుండాపోయాయి. పదేళ్ల పాటు వేచి చూసిన నేతలు ఇక సీట్లు పెరగవని ఒక అంచనాకు వచ్చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు పెంచుతున్నారని, దీని ద్వారా మహిళల సీట్లు సైతం పెరుగుతాయని గతవారం రోజులుగా చర్చలు జరగడం, పార్లమెంటులో బిల్లులు కూడా సిద్ధం కావడంతో యువ, మహిళా నాయకుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎలాగైనా పోటీ చేయాలని వారంతా ఉబలాటపడ్డారు. మహిళలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులు, బంధువర్గంలోనూ పోటీపై లెక్కలు వేసుకున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో నాయకుల్లో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొంది. గత పదేళ్లుగా సీట్ల పెంపు కోసం వేచి చూడగా నిరాశే మిగిలిందని, ఈసారైనా జరుగుతుందని ఆశపడితే నిరాశే మిగిలిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీట్ల పెంపు జరిగితే లోక్‌సభ, అసెంబ్లీకి కలిపి ఒక్కో పార్టీ నుంచి కనీసం 60 మందికిపైగా పోటీ చేసే అవకాశం లభించేది. ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలను కలుపుకుంటే సుమారు 400 మందికిపైగా పోటీ చేసే చాన్స్ ఉండేది. దీని ద్వారా కొత్త, యువతరానికి పోటీ చేసే అవకాశం లభించేది.తీరా సీట్లు పెరగకపోవడంతో యువతరం, మహిళలు నిరాశ చెందారు.
జనగణన తర్వాతైనా.. సాధ్యమేనా?
ప్రస్తుతం రాజ్యాంగ సవరణ వీగిపోయినా.. జనగణన తర్వాత మహిళా బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లులో 2026 తరువాత జరిగే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌లో కొత్తగా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే పదాలను పొందుపర్చారు.ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం మొదట్లో కేవలం డీలిమిటేషన్ బిల్లు పెడితే సరిపోతుందని, అప్పుడు సులువుగా సీట్ల పెంపు లేదా సాధారణ డీలిమిటేషన్‌తో పాటుగా మహిళా బిల్లును అమలు చేయడం సాధ్యమవుతుందని విశ్లేషిస్తున్నారు. కేంద్రం వచ్చే సంవత్సరం మొదటి ఒకటీ, రెండు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకొని పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా చూడాల్సి ఉంటుందని, అలా అయితేనే 2029 ఎన్నికల కల్లా సీట్ల సంఖ్య పెరగడం, మహిళా బిల్లు అమలుకు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఆలస్యమైనా కొద్దీ 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌తో పాటు సీట్ల పెంపు ఆచరణ సాధ్యం కాదని అంటున్నారు.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆలస్యం చేయకుంటేనే సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు సాధ్యమవుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.






