- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాంగ్రెస్‌లో ‘కొత్త’ చిచ్చు! ప్రభుత్వాన్ని కూల్చే ప్లాన్ నిజమేనా? తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (BRS MLA Kotha Prabhakar Reddy) వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు (Congress government) ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని కీలక వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తామే భరిస్తామంటున్నారని, పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని ఆరోపించారు. మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని కొత్త ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. దీంతో, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు (Telangana) తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నిజమేనా? అనే సందిగ్ధంలో పడ్డారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ నేతలు స్పందించారు. మంగళవారం సీఎల్పీ భేటీకి ముందు నోవాటేల్ వద్ద కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎంను కోరుతామన్నారు. కుట్ర కోణం ఉన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈర్ష్య ఎందుకని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటున్నారని, మరో ఐదేళ్లు కూడా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి: పొంగులేటి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పందించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరగుతోందని హాట్ కామెంట్ చేశారు. కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని కలుస్తామని బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటున్నారు.. ప్రజా బలం లేని బీఆర్ఎస్ రూ.వేల కోట్లతో రాజకీయం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచనేనని.. కేసీఆర్ (KCR) నోటి వెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. ధరణిలో లబ్ధిపొందిన బీఆర్ఎస్ బినామీలే ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి చెప్పారని అన్నారు. భూభారతి రావడంతో అక్రమంగా భూములు పొందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఫైర్ అయ్యారు. భూభారతితో కొల్లగొట్టిన భూములన్నీ వెనక్కి తిరిగోస్తాయనే భయంతో ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండని మంత్రి పొంగులేటి సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని కుల్చే కుట్రలు జరిగితే కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.హెచ్‌సీయూ భూముల అక్రమార్కులకు కట్టబెట్టాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. అందుకోసమే ఇలాంటి కుట్రలకు తెరలేపుతోందని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, భూ భారతి అమలు చేస్తామన్నారు.
మాటల వెనుక కుట్ర కోణం: టీపీసీసీ చీఫ్
కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఇలాంటి చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ కు ప్రజా బలం ఉందని స్పష్టం చేశారు.
ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదు: మంత్రి పొన్నం
కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి పొన్నం సెటైరికల్ కౌంటర్ వేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిది ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం అనుకున్నా.. కానీ ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెబుతున్నారని విమర్శించారు. మీరు ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. పడగొట్టుదాం రండీ అంటే పోవడానికి ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
నార్కో టెస్ట్ చేయించాలి : అద్దంకి దయాకర్
కొత్త ప్రభాకర్ రెడ్డి కి నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేపించాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. విచారణ చేయించి.. నిజాలు చెప్పించాలని సీఎంను కోరారు. బీజేపీతో కలిసి గుజరాత్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని, సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది మాట్లాడ్తున్నారని ఆరోపించారు.