- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ శాఖలో పొలిటికల్ ప్రెజర్! కీలక ఫైళ్లపై మేయర్లు, చైర్మన్ల ఆంక్షలు
తెలంగాణ మున్సిపల్ శాఖలో రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. తమకు తెలియకుండా ఒక్క ఫైల్ కదలొద్దంటూ అధికారులకు మేయర్లు, చైర్మన్లు ఆర్డర్లు వేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మేం పైసలిచ్చి వచ్చినం..నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి. మాకు తెలియకుండా ఒక్క ఫైల్ కూడా పోవద్దు. మమ్ములను కూడా చూసుకోవాలి’ అంటూ పలువురు మేయర్లు, చైర్మన్లు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎం పరిధిలోని మున్సిపల్ శాఖలో ఇటువంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో 133 యూఎల్బీలు..
రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అన్నింటిలో కొత్త పాలకవర్గాలు సైతం కొలువుదీరాయి. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది.
ఒక్క ఫైల్ పోవద్దు..
మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్స్‌లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, 116 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు బాధ్యతలు చేపట్టారు. వీరంతా ఎన్నికల్లో పెట్టిన ఖర్చులను రాబట్టుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఆయా మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ పరిధిలో కొత్త లేఅవుట్ పర్మిషన్లు, బడా కంపెనీలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన ఫైళ్లన్నీ తమ వద్దకు రావాల్సిందేనని పలువురు మేయర్లు, చైర్మన్లు ఆదేశాలు జారీచేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో పాటు ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన బిల్లులు సైతం తమకు తెలియకుండా చెల్లించకూడదనే ఆదేశాలు సైతం ఉన్నట్టు సమాచారం. కార్పొరేషన్/మున్సిపాలిటీలో ఎలాంటి కార్యక్రమమైనా తమకు తెలియకుండా చేయకూడదని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఆందోళనలో కమిషనర్లు..
పాలకమండళ్లు ఏర్పడకముందు ఏకచత్రాధిపత్యంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్లు.. ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అదనంగా మేయర్లు, చైర్మన్లు సైతం తోడవడంతో ఒత్తిడి పెరిగిందని పలువురు మున్సిపల్ కమిషనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పోస్టుల కోసం జోరుగా పైరవీలు చేసుకున్న మున్సిపల్ కమిషనర్లు.. ప్రస్తుతం ‘ఇక్కడ పనిచేయడం కంటే సెలవుపై వెళ్లిపోవడమే బెటర్’ అనే ఆలోచనలో ఉన్నట్టు పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సెలవులపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.






