ఎస్ఐఆర్‌పై రాజకీయ పార్టీల అలర్ట్.. బీఎల్ఏల నియామకాలపై ఫోకస్!

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియ రాజకీయ పార్టీల్లో సెగ పుట్టిస్తోంది.

ఎస్ఐఆర్‌పై రాజకీయ పార్టీల అలర్ట్.. బీఎల్ఏల నియామకాలపై ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నది. బిహార్, ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పెద్ద దుమారమే లేపింది. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లో పెద్ద పోరాటమే నడిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఆయా పార్టీలు ముందే అప్రమత్తమయ్యాయి. ఓట్ల తొలగింపు, చేర్పుల వ్యవహారం భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపనుండడంతో జాగ్రత్తపడుతున్నాయి. ఎన్నికల సంఘం తుదినిర్ణయం తీసుకున్నాక తీరిగ్గా స్పందిస్తే లాభం లేదని భావించి.. ఇప్పటి నుంచే ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు రెడీ అయ్యాయి.

బూత్ స్థాయి నుంచే నిఘా..

బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) పరిధిలో బూత్ లెవల్ ఏజెంట్ల(BLA)లను నియమించుకునే వెసులుబాటును రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ కల్పించింది. దీని ద్వారా ఆ ప్రాంతంలో ఓట్ల తొలగింపు, 2002 జాబితాలో ఉన్న వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వలస వెళ్లిన వారు, చనిపోయిన వారి వివరాలను పక్కాగా సరిచూసుకోవచ్చు. బీఎల్ఓలకు సరైన సమాచారం అందించవచ్చు. తద్వారా జాబితా రూపొందించే క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునే అవకాశం బీఎల్ఏల రూపంలో రాజకీయ పార్టీలకు ఉన్నది. ఈ నేపథ్యంలో బీఎల్ఏలను నియమించే పనిలో రాజకీయ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఈ బాధ్యత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే అత్యధిక నియోజకవర్గాల నుంచి పేర్లను ఎన్నికల సంఘం, కలెక్టర్లకు అందించాయి. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు పేర్లను అందించాల్సి ఉన్నట్లు తెలిసింది.

గ్రేటర్‌లో దొరకని ఏజెంట్లు..

పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఎల్ఏల నియామకం కాంగ్రెస్, బీఆర్ఎస్ తోపాటు ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్ గా మారింది. గేటెడ్ కమ్యూనిటీలు, హైక్లాస్ కాలనీల్లో ఏజెంట్లుగా పని చేసేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా వారికి ఆయా కాలనీల్లో నివసించే వారి వివరాలపై పూర్తిస్థాయి పట్టు ఉండడం లేదని సమాచారం. ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు గత కొన్ని సంవత్సరాల్లోనే ఏర్పాటైనవే. అంతేకాకుండా తమ ఓటు హక్కుపై అందులో నివసించే వారు బయటి వారికి ఎక్కువగా యాక్సెస్ ఇవ్వకపోవడం లాంటి కారణాలు కూడా పట్టణాల్లో బీఎల్ఏలు దొరకకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. పట్టణాలు, నగరాల్లో కొత్త కాలనీలు ఏర్పడగా.. అత్యధిక శాతం విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారని భావిస్తున్నారు. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ వారికి ఓటు ఉందా, లేదా? ఓటు ఉన్న వారిలో చనిపోయిన వారు ఎవరు? వాటికి ఆధారాలు ఇస్తారా? అనేది సమస్యగా మారింది. ఇలా పట్టణాలు, నగరాల్లో అనేక సమస్యలు ఉండటంతో ఎస్ఐఆర్ అనేది రాజకీయ పార్టీలతోపాటు ఎన్నికల సంఘానికి సైతం సవాల్గా మారనుందని అంటున్నారు.

పెండింగులోనే అనేక నియోజకవర్గాలు

ఇంకా 29 స్థానాల్లో బీఎల్ఏల జాబితా ఇవ్వలేదని ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఇందులో మాజీ మంత్రుల నియోజకవర్గాలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని నేతృత్వంలో నగరానికి చెందిన ముఖ్య నాయకులు.. సమావేశాన్ని ఏర్పాటు చేసి బీఎల్ఏల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో బీఎల్ఏల పేర్లు ఇవ్వలేదని తెలిసింది.

Next Story