- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైరతాబాద్‌పై ప్రధాన పార్టీల ఫోకస్.. బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి!
మొన్నటి వరకూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను సవాల్‌గా తీసుకున్న వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటి వరకూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను సవాల్‌గా తీసుకున్న వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఖైరతాబాద్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. గెలుపును సవాల్‌గా తీసుకొని సమర్థులైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి.
దానం వర్సెస్ విజయారెడ్డి
పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్‌పై వేటు పడడం ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయనపై చర్యలు తప్పవని న్యాయ నిపుణులు అలర్ట్ చేయడంతో దానం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్నది. ఉప ఎన్నికలో ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దానంతో పాటు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒక వేళ దానంకు టికెట్ ఇస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డి భవిష్యత్ ఏంటి? అని ఆమె సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.
దానంకు బై ఎలక్షన్ భయం
దానం నాగేందర్‌కు బై ఎలక్షన్ భయం వెంటాడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్‌లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన రాత్రికి రాత్రి టీడీపీలో చేరి సైకిల్ గుర్తుతో పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దానం నాగేందర్.. వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కుతుందని ఆశ పడ్డారు. అందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు టీడీపీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ ఉప ఎన్నికలో ఓడిపోయారు. ఇప్పుడు సైతం అదే పరిస్థితి వస్తుందనే టెన్షన్‌లో దానం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకని ఎమ్మెల్సీ ఇచ్చి.. కేబినెట్‌లోకి తీసుకోవాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ నేతలను ఆయన ప్రాథేయపడినట్లు టాక్.
విజయారెడ్డికి బీఆర్ఎస్ వెల్‌కమ్
బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్‌ను బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న విజయారెడ్డి పేరును సైతం ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే తమ పార్టీలోకి వస్తే బరిలోకి దింపుతామంటూ గులాబీ పార్టీలోని కీలక నేతలు ఆమెకు సంకేతాలు పంపినట్లు తెలుస్తున్నది. విజయారెడ్డి పార్టీలోకి రాకపోతే మాత్రం తలసాని సాయి కిరణ్‌ను పోటీలో దింపేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తు్న్నది.
బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి
2014లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రామచంద్రారెడ్డి ఆ తర్వాత వరుసగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. బై ఎలక్షన్‌లో సైతం బీజేపీ నుంచి చింతలకే టికెట్ ఇవ్వనున్నారు. అయితే నియోజకవర్గంలో ఆయనకు ఓటర్లతో వ్యక్తిగతంగా పరిచయాలు తక్కువ అనే విమర్శలున్నాయి. ఆ గ్యాప్‌ను తగ్గించుకుంటే బీజేపీకి విజయావకాశాలు ఉంటాయని పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతున్నది.






