- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల 'ఆరోగ్య భద్రత'కు గ్రహణం.. రూ.300 కోట్ల బకాయిలతో నిలిచిన వైద్య సేవలు!
తెలంగాణ పోలీస్ శాఖలో 'ఆరోగ్య భద్రత' పథకం అగమ్యగోచరంగా మారింది. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.300 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో పోలీసులు, వారి కుటుంబాలకు వైద్యం అందించేందకు నిరాకరిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పోలీస్ శాఖలో అమలవుతున్న ఆరోగ్య భద్రత పథకం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పెండింగ్ లో ఉండడంతో వైద్య సేవలపై సందిగ్ధత నెలకొంది. ఈ హెల్త్ స్కీం కింద సేవలందిస్తున్న నెట్వర్క్ హాస్పిటల్క్ కు ప్రభుత్వం రూ. 300 కోట్లకు పైగా బకాయిపడినట్లు తెలిసింది. బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే.. ఆరోగ్య భద్రత పథకం అమలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం బకాయిల క్లియరెన్స్ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ సిబ్బంది కోరుతున్నారు.
నామమాత్రపు చెల్లింపులు
రాష్ట్రవ్యాప్తంగా 202 నెట్వర్క్ హాస్పిటల్స్ పోలీసులకు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నాయి. రూ.13 వేలకు గర్భిణులకు ప్రసవాలు, ఇన్ పేషెంట్ సౌకర్యాలు వంటివి కల్పిస్తున్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే బిల్లుల చెల్లింపులు సకాలంలో జరగకపోవడంతో సేవలు నిలిపివేస్తామని ప్రతి మూడు నెలలకోసారి ఆస్పత్రులు హెచ్చరిస్తున్నాయి. 2023 అక్టోబర్ నుంచి బిల్లులు మంజూరు కాలేదని, గత జూన్ నాటికి రూ. 349.11 కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. వైద్య సేవలు నిలిపివేస్తామన్న సమయంలో మాత్రమే నామమాత్రంగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల రూ.20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. రూ. కోటి బిల్లు ఉంటే రూ. 5లక్షలు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్న పరిస్థితి ఉన్నది. బకాయిల కారణంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రులను అడగలేకపోతున్నామని పోలీసు ఉన్నతాధికారులు సైతం వాపోతున్నారు. మరోవైపు ఆరోగ్యభద్రత కార్డులు ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో సరైన స్పందన ఉండడం లేదని రిటైర్డ్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్పస్ ఫండ్ వినియోగం ఎక్కడ?
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 జూన్ లో పోలీసుల ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభించారు. గత జూన్ వరకు ఈ స్కీమ్ లో 80,807 మంది పోలీసు సిబ్బంది, అధికారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈ స్కీమ్ ద్వారా పోలీస్ సిబ్బంది నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల శాలరీ నుంచి ప్రతి నెల కార్పస్ ఫండ్ ను కట్ చేస్తున్నారు. మార్చి 2025 వరకు ఉద్యోగుల నుంచి కార్పస్ ఫండ్ గా డిపాజిట్ అయిన మొత్తం రూ.108.04 కోట్లు. అయితే ఈ డిపాజిట్స్ ను పోలీసుల ఆరోగ్య భద్రతకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య భద్రత స్కీం 2014లో ప్రారంభమైన సమయంలో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి వరకు నెలకు రూ.90 మాత్రమే కట్ చేసేవారు. 2025 నుంచి దీన్ని రూ.300లకు పెంచారు. ఇన్ స్పెక్టర్, ఉన్నతాధికారులకు రూ.120 నుంచి రూ.400కు పెంచారు. అయితే 80 వేల మంది పోలీసు సిబ్బందికి సంబంధించిన ఆరోగ్య భద్రత విషయంపై.. ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని పోలీసు కుటుంబాలు కోరుతున్నాయి.






