15 నిమిషాల్లో మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు.. డయల్-112తో తప్పిన విషాదం

by Ramesh Naini |   (  Updated:2026-06-18 15:35:27  IST  )

అత్యవసర సమయంలో డయల్-112 వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో మరోసారి నిరూపితమైంది.

15 నిమిషాల్లో మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు.. డయల్-112తో తప్పిన విషాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో : అత్యవసర సమయంలో డయల్-112 వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో మరోసారి నిరూపితమైంది. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళను, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) సిబ్బంది సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. గురువారం మధ్యాహ్నం 12:23 గంటలకు డయల్-112 కాల్ సెంటర్‌కు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. మెట్‌పల్లి పరిధిలోని ఒక కాలువ వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతోందని సమాచారం అందడంతో, కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది వెంటనే స్పందించారు. కేవలం ఒకే నిమిషంలో (12:24 గంటలకు) మెట్‌పల్లి పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు.

15 నిమిషాల్లోనే..

సమాచారం అందుకున్న వెంటనే మెట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఆ మహిళను గుర్తించి రక్షించారు. రక్షించిన మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో డయల్-112 సెంటర్ అందించిన వేగవంతమైన సమాచారం, నిరంతర పర్యవేక్షణ కీలక పాత్ర పోషించాయని స్థానిక పోలీసులు అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ప్రాణాలను కాపాడటంలో డయల్-112 వ్యవస్థ, తెలంగాణ పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని టీజీఐసీసీసీ డైరెక్టర్ పేర్కొన్నారు.

Next Story