- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: పనీర్ లవర్స్ అలర్ట్.. మీరు తినే పనీర్ ప్యూర్ కాదా?
హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మూఠాలపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మూఠాలపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. నగరవ్యాప్తంగా సాగిన భారీ ఆపరేషన్ ఒక కల్తీ పనీర్ తయారీ కేంద్రాన్ని గుట్టురట్టు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున నకిలీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నమ్మకమైన వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా నగరంలోని 45 ప్రముఖ ఫుడ్ ఔట్ లెట్లతో పాటు, 8 పనీర్ తయారీ యూనిట్లలో ఏకకాలంలో మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, కనీస లైసెన్సులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా పలు యూనిట్లు పనీర్ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
825 కిలోల కల్తీ పనీర్ స్వాధీనం..
ఈ దాడుల్లో భాగంగా అధికారులు సుమారు 825 కిలోల కల్తీ పనీర్‌ను సీజ్ చేశారు. వీటితో పాటు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన భారీ మొత్తంలో నకిలీ చీజ్, ఇతర తినుబండారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాణ్యమైన పాలకు బదులుగా సింథటిక్ పాలు, నాసిరకం పదార్థాలు, రసాయనాలను ఉపయోగించి ఈ కేంద్రాల్లో పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. పనీర్ బరువు పెంచడానికి, గట్టిదనం కోసం స్టార్చ్ (గంజిపొడి), మితిమీరిన నీరు, ఆరోగ్యానికి హాని కలిగించే నాన్-మిల్క్ ఫ్యాట్స్ (జంతువుల కొవ్వు లేదా వనస్పతి) కలిపి ఈ దందాను నడిపిస్తున్నట్లు తేలింది. ఇవి తింటే ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా, అక్రమంగా కల్తీ పనీర్ తయారు చేస్తున్న వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి నకిలీ తయారీ కేంద్రాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.






