- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాంకేతిక నేరాలను ధీటుగా ఎదుర్కోవాలి : గవర్నర్ శివప్రతాప్ శుక్లా
మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు సాంకేతికంగా, మానసికంగా మరింత దృఢంగా తయారు కావాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.

- ఘనంగా టీజీపీఏ 40వ ఆవిర్భావ దినోత్సవ ముగింపు వేడుకలు
- సైబర్, ఏఐ సవాళ్లపై పోలీసులకు పక్కా అవగాహన అవసరం
- ప్రజా నమ్మకానికి పోలీసులే వారధి
దిశ, తెలంగాణ బ్యూరో : మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు సాంకేతికంగా, మానసికంగా మరింత దృఢంగా తయారు కావాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నూతనంగా ఎంపికైన యువతను బాధ్యతాయుతమైన ప్రజా సేవకులుగా తీర్చిదిద్దడంలో రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. శుక్రవారం టీజీపీఏ క్యాంపస్‌లో జరిగిన 40వ రైజింగ్ డే ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రజల నమ్మకానికి పోలీసులు వారధి లాంటివారు
యూనిఫాం అంటే అధికారమే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి, ప్రజల నమ్మకానికి మధ్య పోలీసులు వారధి లాంటివారని గవర్నర్ పేర్కొన్నారు. పరీక్షలతో ఉద్యోగం వస్తుందేమో కానీ.. వారిలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేది ఇలాంటి శిక్షణా సంస్థలేనని స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ నివారణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. పోలీసు యూనిఫాం కేవలం అధికారం మాత్రమే కాదని.. క్రమశిక్షణ, సేవ, మానవత్వానికి ప్రతీక అని ఆయన అన్నారు.
భవిష్యత్తుకు తగ్గ శిక్షణ అకాడమీ
డైరెక్టర్ అభిలాష బిస్త్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల ఈ అకాడమీ ప్రయాణం ఎందరో డైరెక్టర్ల అలుపెరగని కృషి ఫలితమన్నారు. సంస్థల నిర్మాణం అనేది స్ప్రింట్ కాదని, ఒకరి నుంచి మరొకరు బాధ్యతలు తీసుకునే రిలే రేస్ లాంటిదని అభివర్ణించారు. మారుతున్న నేరాల తీరును అంచనా వేస్తూ.. యూనిసెఫ్, ట్రిపుల్ ఐటీ, జేఎన్టీయూ హెచ్, రాష్ట్రీయ రక్షా వర్సిటీల భాగస్వామ్యంతో భవిష్యత్ అవసరాలకు తగ్గ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు క్రీడా పోటీలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సైబర్ భద్రత, డ్రగ్స్ నివారణపై ఓపెన్ హౌస్ సెషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ సి. ఆంజనేయరెడ్డి, ఏ.వి. సుబ్బారావు, కె. అరవిందరావు, ఎం. రతన్, ఎం. మాలకొండయ్య, జితేందర్, వి.కె. సింగ్, సందీప్ శాండిల్య, ఏ.ఆర్. శ్రీనివాస్ మాజీ డైరెక్టర్లతో పాటు సైబరాబాద్ సీపీ ఎం.రమేష్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకాడమీ పక్షాన గవర్నర్‌ను, మాజీ డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు.






