గాలిలో దీపంలా పోలీసుల ఆరోగ్య భద్రత.. వెంటాడుతోన్న నిధుల కొరత

by Kema Shiva Kumar |

పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు ఆర్థిక అడ్డంకులు వెంటాడుతున్నాయి.

గాలిలో దీపంలా పోలీసుల ఆరోగ్య భద్రత.. వెంటాడుతోన్న నిధుల కొరత
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు ఆర్థిక అడ్డంకులు వెంటాడుతున్నాయి. సుమారు రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రూ. 349.11 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా పోలీస్ సంక్షేమ విభాగం తెలిపింది. అంతేకాకుండా వైద్యానికి సంబంధించి ప్యాకేజీ రేట్లను కూడా కొన్ని సంవత్సరాలుగా సవరించలేదని, పైగా బిల్లులు పెండింగ్ పెడితే ఎలా అని ఆస్పత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి. మరోవైపు ప్రతి నెలా తమ జీతం నుంచి మెడికల్ విభాగం డబ్బులు కట్ చేస్తున్నా.. తమ ఆరోగ్యం కోసం ఖర్చు చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

అతి తక్కువ ధరలే అయినా..

ఆరోగ్య భద్రత పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 202 హాస్పిటల్స్ పోలీసులకు ఆరోగ్య సేవలందిస్తున్నాయి. రూ.13 వేలకే డెలివరీ, ఇన్ పేషెంట్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంత తక్కువ ధరలతో వైద్యం అందజేస్తున్నా.. బిల్లులు సకాలంలో అందజేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వైద్య సేవలను నిలిపివేస్తామని పలు సందర్భాల్లో తెలిపామని పేర్కొంటున్నాయి. అయితే సమాజ రక్షణ బాధ్యతల్లో ఉన్న పోలీసులకు సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తమ నిర్ణయాలను విరమించుకుని సేవలు అందిస్తున్నట్లు వివరిస్తున్నాయి. సుమారు 80 వేల మంది సిబ్బందికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని పోలీసుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పెండింగ్ బిల్లులు కారణంగా సిబ్బందికి మెరుగైన సేవలందించమని హాస్పిటల్ యాజమన్యాలను రిక్వెస్ట్ చేయలేక పోతున్నామని ఉన్నతాధికారులు సైతం వాపోతున్నారు.

డిపాజిట్లు రూ.108 కోట్లు

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 జూన్ లో పోలీసుల కోసం ఆరోగ్య భద్రత స్కీంను ప్రారంభించారు. దీని ద్వారా సిబ్బంది, ఉన్నతాధికారుల వరకు వారి వేతనాల నుంచి ప్రతి నెల కార్పస్ ఫండ్ ను డిపాజిట్ చేస్తున్నారు. మార్చి 2025 వరకు ఉద్యోగుల నుంచి కార్పస్ ఫండ్ గా మొత్తం రూ.108.04 కోట్లు డిపాజిట్ అయింది. ఈ స్కీమ్ లో 80,807 మంది పోలీసు సిబ్బంది, అధికారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వారిపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులను కూడా జత చేస్తూ గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. ఈ స్కీం ద్వారా ఇప్పటి వరకు 2,61,212 మంది సేవలను వినియోగించుకున్నట్లు పోలీసు సంక్షేమ విభాగం తెలిపింది.

Next Story