చలానాలకు చెక్‌ పెట్టేందుకు ‘హైటెక్’ తెలివి.. మాగ్నెట్లు, ఫేక్ నంబర్ ప్లేట్లతో పోలీసులకే సవాల్!

by Ramesh Naini |

హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు ప్రదర్శిస్తున్న ‘హైటెక్ తెలివి’ పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.

చలానాలకు చెక్‌ పెట్టేందుకు ‘హైటెక్’ తెలివి.. మాగ్నెట్లు, ఫేక్ నంబర్ ప్లేట్లతో పోలీసులకే సవాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు ప్రదర్శిస్తున్న ‘హైటెక్ తెలివి’ పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. నంబర్ ప్లేట్లు కనిపించకుండా అయస్కాంతాలు (మాగ్నెట్లు) అమర్చడం, నకిలీ నంబర్ ప్లేట్లు వాడటం వంటి అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా నగరంలో ఇద్దరు కిలాడీలు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు.

నంబర్ ప్లేట్‌కు మాగ్నెట్..

సైనిక్‌పురికి చెందిన కమ్రాన్ (28) అనే ప్రైవేట్ ఉద్యోగి చలానాల నుంచి తప్పించుకునేందుకు తన డ్యూక్ బైక్ ముందువైపు నంబర్ ప్లేట్ పూర్తిగా తొలగించాడు. వెనుక నంబర్ ప్లేట్‌కు ఎవరికీ అనుమానం రాకుండా ఓ మాగ్నెట్ అమర్చాడు. తద్వారా, అవసరమైనప్పుడు ఆ నంబర్ ప్లేట్ పైకి మడతపడేలా (కనిపించకుండా) సెటప్ చేసుకున్నాడు. శనివారం బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న రాయదుర్గం ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించగా ఈ బండారం బయటపడింది. వెంటనే డ్యూక్ బైక్‌ను సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించినట్లు ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ పవన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

రికవరీ ఏజెంట్ల కళ్లుగప్పేందుకు నకిలీ నంబర్ ప్లేట్

గోల్కొండ ట్రాఫిక్ పరిధిలో ఫేక్ నంబర్ ప్లేట్ వాడుతున్న మరో వ్యక్తి పట్టుబడ్డాడు. మహమ్మద్ మోహినుద్దీన్ అనే వాహనదారుడు ట్రాఫిక్ చలానాలతో పాటు, ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల నుంచి తప్పించుకునేందుకు తన యాక్టివాకు నకిలీ నంబర్ ప్లేట్ బిగించాడు. టోలిచౌకీ-గచ్చిబౌలి రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ సదరు వాహనాన్ని ఆపి పత్రాలు అడిగారు. వాహనం ఆర్సీలో (TS12 ER 2466) ఉంటే, నంబర్ ప్లేట్‌పై మాత్రం (TS11 EU 5327) అని ఉండటాన్ని పోలీసులు పసిగట్టారు. నిందితుడిపై టోలిచౌకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గమనిక: చలానాల నుంచి తప్పించుకునేందుకు వాహనాలకు ఇలాంటి చట్ట వ్యతిరేక మార్పులు చేస్తే, మోటార్ వెహికిల్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story