- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Municipal Election: తెలంగాణ పోలీసుల మంచి మనసు
రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలియజేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం తన డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ బుధవారం పర్యవేక్షించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్ ద్వారా నేరుగా వీక్షిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోలింగ్ స్టేషన్ల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలిగిందని, ఈ కెమెరాల నిఘా కారణంగాను, పోలీస్ సిబ్బంది బందోబస్తు వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అదుపులో ఉన్నాయన్నారు.
పోలీస్ సిబ్బంది సహాయం
ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో పోలీసు సిబ్బంది అంకితభావంతో పాటు ఈ ఆధునిక వెబ్‌కాస్టింగ్ సాంకేతికత ఎంతగానో తోడ్పడిందని ఆయన ప్రశంసించారు. ఈ ఎన్నికల కోసం తెలంగాణ పోలీసులు అత్యంత పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని డీజీపీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తూ భారీ ఎత్తున భద్రతను కల్పించామన్నారు. 1,302 అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్), 1,926 సమస్యాత్మక (సెన్సిటివ్) మరియు 4,975 సాధారణ కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారని డీజీపీ పేర్కొన్నారు.
నిజామాబాదులో సీపీ పి.సాయి చైతన్య, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, పెద్దపెల్లి డీసీపీ రామ్ రెడ్డి వృద్ధ ఓటర్లను, వికలాంగులను వీల్ చైర్‌లో పంపించడం జరిగిందని తెలిపారు. ములుగు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న నాలుగో బెటాలియన్ సిబ్బంది మూర్చ వచ్చి పడిపోయిన ఓటరుకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా లోని జిన్నారం మండల పరిధికి చెందిన రాలకత్వలో వృద్ధులను ఆటోలు తీసుకువెళ్లి ఓట్లు వేసేలా తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓటర్ల పసిపిల్లలను వారు ఓటేసి వచ్చే వరకు శ్రద్ధగా పోలీస్ సిబ్బంది చూశారని తెలిపారు.






