అక్కను చంపిన కేసులో తమ్ముడు అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పోలీసులు

by Naga Rani Yarlagadda |

అక్క తరచూ ఫోన్లో మాట్లాడుతుందని గమనించిన తమ్ముడు.. ఆమెను హతమార్చడం తెలంగాణలో కలకలం రేపింది.

అక్కను చంపిన కేసులో తమ్ముడు అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: అక్క తరచూ ఫోన్లో మాట్లాడుతుందని గమనించిన తమ్ముడు.. ఆమెను హతమార్చడం తెలంగాణలో కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మండలంలోని పెంజర్లకు చెందిన దేశాల రాఘవేందర్ కు రుచిత, రోహిత్.. ఇద్దరు సంతానం. రుచిత డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటి వద్దే ఉంటోంది. రోహిత్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కాగా.. రుచిత.. అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి దినేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పంచాయతీ పెట్టి దినేష్ ను మందలించారు.

ఆ తర్వాత కూడా రుచిత ఫోన్లో మాట్లాడగా.. తల్లిదండ్రులు వద్దని వారించారు. ఈ క్రమంలో జులై 28 సోమవారం ఇంట్లో రుచిత, రోహిత్ మాత్రమే ఉన్నారు. దినేశ్ తో రుచిత మాట్లాడటాన్ని గమనించిన రోహిత్.. వద్దన్నా మాట్లాడటం ఏంటని గొడవ పడ్డాడు. కోపంతో ఆమె గొంతుకకు వైరు బిగించి హత్య చేశాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి రుచిత నిద్రపోతున్నట్లు కనిపించినా.. అనుమానం వచ్చి లేపగా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. దీంతో తండ్రి రాఘవేందర్ కొడుకుపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్ ను మంగళవారం కొత్తూరు టౌన్లోని పెంజర్ల క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణకు రుచితను తానే చంపినట్లు అంగీకరించాడు. దీంతో రోహిత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Next Story