పోచారం చెరువు తెగే ప్రమాదం.. అధికారులను అప్రమత్తం సర్కార్

by Muthe.Rajitha |

కామారెడ్డి జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జలవిలయం సంభవించింది.

పోచారం చెరువు తెగే ప్రమాదం.. అధికారులను అప్రమత్తం సర్కార్
X

దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డి జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జలవిలయం సంభవించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి-మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం చెరువుపై ఉన్న పోచారం ప్రాజెక్టు కుండపోత వర్షాల కారణంగా పొంగిపొర్లుతోంది. నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండగా.. అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలినా డ్యామ్ పక్కన ఉన్న అలుగుకు గండిపడింది. ఏ క్షణమైనా కట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. పోచారం చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని సమాచారం అందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మరోవైపు మెదక్ కలెక్టర్ తో జిల్లాలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేయాలని, జిల్లా యాంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా తెలంగాణలో నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. ఫలితంగా పలు జిల్లాలు వరదలతో అతలాకుతలమయ్యాయి.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాగల రెండు గంటల్లోపలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ జారీ చేయబడ్డాయి. కాగా ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో అత్యధికంగా 423 మి.మీ, రామయంపేటలో 316.3 మి.మీ వర్షపాతం నమోదైంది. NH-44పై జంగంపల్లి వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో హైవే మూసివేయబడింది. దీంతో కామారెడ్డి-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Next Story