- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pocharam Dam Safe: ఊహించని వరదను తట్టుకుని సేఫ్.. నిజాం కాలం నాటి పోచారం డ్యామ్ చరిత్ర ఇదే
చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన పోచారం డ్యామ్ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఉదాహరణగా నిలిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Telangana Floods) కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యామ్ కు (Pocharam Dam) సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో గేట్లు తెరిచి ఉంచినా డ్యామ్ పై నుంచి వరద ఉప్పొంగింది. భయానకంగా ప్రవహిస్తున్న వరదతో నిన్న రాత్రి అంతా పరిసర ప్రాంతాల ప్రజలు టెన్షన్ తో గడిపారు. కట్ట తెగే ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు సైతం స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే పోచారం డ్యామ్ విషయంలో నరాలు తెగే ఉత్కంఠతో బిక్కుబిక్కుమంటూ గడిపినా భారీ వరదను ఈ డ్యామ్ తట్టుకుని నిలబడింది. ఇవాళ ఉదయం వరద తగ్గడంతో పరిస్థితి అంతా చేతులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. పోచారం డ్యామ్ వరదను తట్టుకుని నిలబడడంపై తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గర్వకారణం:
103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని సురక్షితంగా నిలబడిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఎంఎఫ్ డీ 70,000 (గరిష్ట వరద) క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువ అని తెలిపారు. నిన్నటి ఉద్రిక్త క్షణాల తర్వాత, ప్రాజెక్ట్ బలంగా నిలబడటం, చూడటం నాతో పాటు మా నీటి పారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగించిందని.. నిజంగా ఇది గర్వించదగ్గ మరియు భావోద్వేగ సమయం అన్నారు.
నిజాం నాటి కట్టడం..
మెదక్ (Medak) పట్టణానికి సమీపంలో ఉన్న ఈ పోచారం డ్యామ్ కు ఘనమైన చరిత్ర ఉంది. చివరి నిజాం రాజు (Nizam King) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.27.11 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం డ్యామ్ తీరుస్తోంది. సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు, మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు. ఈ ప్రాజెక్టు కు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలను ఏ, బీ జోన్లుగా, 1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన బీ జోన్లుగా విభజించారు.
విడిది కోసం నిజాం రాజు ఇక్కడికే:
అప్పట్లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ నుంచి విడిది కోసం పోచారం డ్యామ్ వద్దకు వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లోనే డ్యామ్ వద్ద రెండు అతిథి గృహాలను నిర్మించారు. డ్యామ్ కు సమీపంలోనే పోచారం అభయారణ్యం ఉంది. అభయారణ్యంలో వేటకు వచ్చి డ్యామ్ వద్ద రాజు సేద తీరేవాడని చెబుతున్నారు. చుట్టూ దట్టమైన అడవి, నీటి వసతి ఉండటంతో నిజాం రాజు ఈ డ్యామ్ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. నిజాం నాటి కట్టడం కావడంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కొత్త అనుభూతి చెందుతారని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి సమీప దూరంలోనే ఉండటంతో పర్యాటకులకు పోచారం డ్యామ్ ఓ మంచి డెస్టినేషన్ గా చెబుతుంటారు.






