రేపు హైదరాబాద్‌కు మోడీ, ఇదిగో షెడ్యూల్.. వాటిపై నిషేధం

by velandi.Saikiran |   (  Updated:2026-05-08 20:30:18  IST  )

ప్రధాని మోడీ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్నారు.

రేపు హైదరాబాద్‌కు మోడీ, ఇదిగో షెడ్యూల్.. వాటిపై నిషేధం
X

రేపు హైదరాబాద్‌కు మోడీ

-మూడోసారి బాధ్యతలు చేపట్టాక ప్రధాని తొలి పర్యటన

-హెచ్ఐసీసీలో అధికారిక కార్యక్రమాలు

-పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు. పశ్చిమబెంగాల్‌లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకులు.. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంతకుముందు హెచ్ఐసీసీలో దాదాపుగా రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..

జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ.2,360 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు రూ.3,175 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గూడెబెల్లూర్-మహబూబ్ నగర్ జాతీయ రహదారి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.1,243 కోట్లతో చేపట్టనున్న కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులను జాతికి అంకితం చేయనున్నారు. రూ.200 కోట్లతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు సైతం శంకుస్థాపన చేయనున్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు..

మోడీ పర్యటనకు అధికారులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రొటోకాల్ పరంగా ప్రధానికి చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణారావు సమీక్షించి పలు సూచనలు చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నందున, అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన, పరేడ్ గ్రౌండ్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు చర్యలు చేపట్టాయి. కమిటీలు వేసుకొని, వివిధ స్థాయిల నాయకులకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ వ్యాప్తంగా కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. ప్రధాని దృష్టిలో పడేందుకు నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధాని పర్యటన ఇలా..

- కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్న ప్రధాని ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.

– అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో హెచ్ఐసీసీకి చేరుకుంటారు.

– మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటలకు హెచ్ఐసీసీలో పలు కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి కొద్దిసేపు ప్రసంగిస్తారు.

– సాయంత్రం 4.10 గంటలకు హైటెక్ సిటీ ప్రాంతంలో నిర్మించిన సింధూ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.

– 5.10 గంటలకు హెలీకాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.

– అనంతరం 6.30 నుంచి 7.30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు.

–రాత్రి 7.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరుతారు.

Next Story