పథకం ప్రకారమే భారీ దొంగతనం: కేంద్రమంత్రి బండి సంజయ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-03 10:46:35  IST  )

పథకం ప్రకారమే భారీ దొంగతనం: కేంద్రమంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన బంగారం దోపిడీ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దొంగతనం పక్కా పథకం ప్రకారం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. దుండగులు కాల్పులు జరుపుతున్నా వెనకాడకుండా షాపు సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించారని బండి సంజయ్ కొనియాడారు. కాల్పుల్లో గాయపడిన ముగ్గురు సిబ్బందికి ప్రస్తుతం వైద్య సాయం అందుతోందని, వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడుతున్నట్లు తెలిసిందని, పోలీసులు విచారణను వేగవంతం చేశారని, త్వరలోనే నిందితులు పట్టుబడతారన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..

ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులోకి ఐదుగురు దుండగులు వినియోగదారుల ముసుగులో ప్రవేశించారు. నగలు చూపించమని అడిగిన దుండగులు, సిబ్బంది ఆభరణాలు తీసి చూపిస్తుండగా ఒక్కసారిగా తుపాకులు బయటకు తీశారు. గన్‌తో బెదిరించి సిబ్బందిని కట్టేసి, షాపులోని భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకున్నారు. దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ గౌస్‌ ఆలం విచారణను ముమ్మరం చేశారు. క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. జ్యువెలరీ షాపు సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్‌తో పాటు తుపాకీ మ్యాగ్జిన్‌ను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో పడి ఉన్న బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ భారీ దోపిడీ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

గన్ గురిపెట్టి.. మోకాళ్లపై కూర్చోబెట్టి.. కరీంనగర్లో బంగారం దోపిడీ సీసీటీవీ ఫుటేజ్

Next Story